Breaking News

భర్త కోసం అడవిబాట... మావోలను కదిలించిన ఇంజినీర్ భార్య పోరాటం


మావోయిస్టులు తాము కిడ్నాప్ చేసిన ఇంజనీర్ అజయ్ రోషన్ లక్రాను ప్రజాకోర్టులో విడుదల చేశారు. ఏడు రోజుల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆయణ్ని మీడియా ప్రతినిధులు, గ్రామస్థుల సమక్షంలో లక్రాను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆ అటవీ ప్రాంతంలో చేస్తున్న అభివృద్ది పనులను నిలిపివేయాలంటూ అడవి బిడ్డలతో నినాదాలు చేయించారు. అధికారులకు ఒక రకమైన హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల అనంతరం మావోయిస్టుల చెర నుంచి విడుదలైన ఇంజనీర్ అజయ్ రోషన్.. తన భార్య అర్పిత, బిడ్డను కలుసుకొని భావోద్వేగానికి గురయ్యారు. తన విడుదల కోసం ప్రయత్నాలు చేసిన మీడియా ప్రతినిధులకు, అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను, ప్యూన్ లక్ష్మణ్ విధుల్లో భాగంగా గోర్నా మంకెలి వెళుతున్న సమయంలో మార్గ మధ్యలో కొంతమంది తమను నిలువరించారని.. ఎక్కడికి వెళుతున్నారంటూ ఆరా తీశారని ఈ ఇంజనీర్ తెలిపారు. తాము పీఎంజీఎస్‌వై పథకంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళుతున్నట్లు చెప్పామని.. మరికొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ నిలువరించారని చెప్పుకొచ్చారు. తమ వాహనం కావాలని అడిగితే వీలుపడదని, తాము తిరిగి వెళ్లాలని చెప్పగా.. మీరు ఒకరోజు ఇక్కడ ఉండాల్సి ఉంటుందని చెప్పి తమను తీసుకెళ్లారని వివరించారు. వారి అదుపు ఉన్న సమయంలో తనను ఈ ప్రాంతంలో జరుగుతున్న రహదారుల పనులకు సంబంధించిన అంశాల గురించి అడిగారని చెప్పారు. ఏడు రోజులుగా ఇంజనీర్‌ భార్య చేస్తున్న పోరాటం ఫలించి, మావోయిస్టులు ఆయణ్ని క్షేమంగా విడుదల చేయడంతో కుటుంబసభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భర్తను క్షేమంగా అప్పగించడంతో అర్పిత ఆనందానికి అవధుల్లేవు. ‘మీరు బలంగా ఉన్నారని నాకు తెలుసు’ అని అర్పితా లక్రా తన భర్తతో అంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజయ్ తన భార్యను ఓదార్చడానికి ప్రయత్నించినప్పుడు ఆమె పై విధంగా స్పందించినట్టు వీడియోలో కనబడుతోంది. కాగా, ‘అపహరణకు గురైన సబ్ ఇంజనీర్ అజయ్ లక్రాను సురక్షితంగా విడుదల చేసినట్టు మాకు సమాచారం అందింది.. బుధవారం సాయంత్రానికి ఆయన బీజాపూర్ చేరుకునే అవకాశం ఉంది.. తొలుత అతడి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడమే ప్రాధాన్యత…ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని అని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజన్ చెప్పారు.


By November 18, 2021 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/emotional-reunion-of-chhattisgarh-sub-engineer-ajay-roshan-lakra-abducted-by-maoists/articleshow/87769925.cms

No comments