ఎలాంటి ప్రతిఘటనకైనా సిద్ధంగా ఉండండి.. సైన్యానికి అరుణాచల్ గవర్నర్ పిలుపు!
సరిహద్దుల వెంబడి ఎటువంటి పరిణామాలకైనా సైన్యం సిద్ధంగా ఉండాలని బ్రిగేడియర్ బీడీ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంగ్లాంగ్ జిల్లాలోని రాజ్‌పుత్ రెజ్మింట్ 14వ బెటాలియన్‌లో జరిగిన సైనిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీడీ మిశ్రా మాట్లాడుతూ.. 1962లో దేశానికి బలమైన నాయకత్వం ఉండుంటే చైనా నుంచి దురాక్రమణను భారత ఎదుర్కొనేది కాదని ఆయన అన్నారు. దేశం తన రక్షణను ఎప్పుడూ తగ్గించుకోకూడదని గవర్నర్ సూచించారు. ‘‘1962లో భారత్‌కు బలమైన నాయకత్వం ఉండుంటే చైనాకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో ఎదురుదెబ్బలు తగిలేవి కావు.. ఇప్పుడు క్షేత్రస్థాయి సమీకరణాలు మారిపోయాయి.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సాయుధ దళాలలో భారతదేశం ఒకటి.. అయితే, మన కాపలాదారులను మనం తగ్గించకూడదు.. ప్రతి సైనికుడు మన సరిహద్దుల్లో ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రం సైనికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తోందని అన్నారు. ‘భద్రతా బలగాల పట్ల ప్రభుత్వ వైఖరిలో పెనుమార్పు కనిపిస్తోంది.. ఇప్పుడు అత్యున్నత రాజకీయ నాయకత్వం భద్రతా సిబ్బంది శ్రేయస్సు గురించి చాలా ఆందోళన చెందుతోంది’ అని వ్యాఖ్యానించారు. సిబ్బంది క్రమశిక్షణను కొనసాగించాలని, తమను తాము కఠినంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అలాగే, పౌరులతో స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘యూనిఫాంలో ఉన్న వ్యక్తులు దృఢ సంకల్పంతో ఉంటే, వారు తమ అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు’ అని గవర్నర్ నొక్కి చెప్పారు. 14వ బెటాలియన్, సైనికుల నైపుణ్యాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఇక, 1965 నాటి భారత్-పాక్ యుద్ధంలో రెజ్మెంట్ కమాండర్‌గా బీడీ మిశ్రా పాల్గొన్నారు.
By November 21, 2021 at 11:13AM
No comments