Breaking News

ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి..త్రుటిలో తప్పించుకున్న ఖాదిమీ


ఆదివారం తెల్లవారుజామున ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్-ఖాదిమీ నివాసంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి నుంచి ప్రధాని త్రుటిలో తప్పించుకున్నట్టు ఇరాక్ సైన్యం వెల్లడించింది. పేలుడు పదార్థాల కూడిన డ్రోన్‌‌తో దాడిచేశారని తెలిపింది. ప్రధాని అల్-ఖాదిమీపై హత్యాయత్నం జరిగింది.. కానీ, ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొంది. రాజధాని నగరం బాగ్దాద్‌‌లో అత్యంత కట్టుదిట్టమైన గ్రీన్ జోన్‌లో డ్రోన్ దాడి జరగడం కలకలం రేగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఖాదిమీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో డ్రోన్ దాడి గురించి తెలిపారు. తాను సురక్షితంగా ఉన్నానని, అంతా సంమయనం పాటించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ.. ఖాదిమీ నివాసంలో కనీసం ఒక్క పేలుడు సంభవించిందని, ప్రధాని సురక్షితంగా ఉన్నారని రాయిటర్స్‌కు ధ్రువీకరించారు. కాగా, ఈ దాడికి బాధ్యతవహిస్తూ ఇంత వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ప్రధాని నివాసం ఉండే గ్రీన్ జోన్‌లోనే పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాలు, సిబ్బంది నివాసాలు, ప్రభుత్వ భవనాలు ఉంటాయి. తాము పేలుడు శబ్దం విన్నామని, కాల్పులు కూడా జరిగాయని ఆ ప్రాంతంలో ఉండే పలువురు తెలిపారు. ఇరాక్ సార్వత్రిక ఎన్నికలకు వ్యతిరేకంగా ఇరాన్‌ మద్దతున్న సాయుధ ముఠాలు ఇటీవలి వారాల్లో గ్రీన్ జోన్ సమీపంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో డ్రోన్ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


By November 07, 2021 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/iraq-pm-mustafa-al-kadhimi-unhurt-after-drone-attack-at-his-residence/articleshow/87562293.cms

No comments