Breaking News

బెంగళూరులో ఓ వ్యక్తికి ‘ఒమిక్రాన్’?.. కర్ణాటక మంత్రి ప్రకటనతో ఆందోళన


దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్‌ కర్ణాటకలోకి ప్రవేశించిందనే అనుమానం బలపడుతోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వృద్ధుడిలో వెలుగుచూసిన వైరస్‌ ప్రస్తుత వేరియంట్ కంటే ఎంతో భిన్నంగా ఉందని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ చేసిన ప్రకటనతో ఆందోళన మొదలైంది. వయో వృద్ధుడు కావడంతోనే ఆ వ్యక్తిలో భిన్నమైన వేరియంట్ బయటపడింది. రెండు రోజుల కిందట దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ రాగా.. జీనోమ్ పరీక్షల్లో ఒమ్రికాన్ కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా, వృద్ధుడికి వైరస్ నిర్ధారణ కావడంతో అతడి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపినట్టు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ‘గత తొమ్మిది నెలలుగా వేరియంట్ మాత్రమే ఉంది.. కానీ మీరు అతడి నమూనాల్లో ఓమిక్రాన్ అని చెబుతున్నారు. దాని గురించి నేను అధికారికంగా వెల్లడించలేను.. ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో టచ్‌లో ఉన్నాను’’ అని తెలిపారు. జెనోమిక్ సీక్వెన్సింగ్ తర్వాత ఓమిక్రాన్ ఎలా ప్రవర్తిస్తుందనే దాని గురించి డిసెంబర్ 1న మాకు స్పష్టమైన సమాచారం లభిస్తుంది.. దాని ప్రకారం అన్ని చర్యలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అంతేకాదు దక్షిణాఫ్రికాలోని నా క్లాస్‌మేట్స్‌తో మాట్లాడానని, మిగతా వాంటి కంటే వేగంగా వ్యాప్తిచెందుతుందని చెప్పారన్నారు. ‘కానీ, డెల్టా మాదిరిగా ప్రమాదకారి కాకపోవచ్చు.. ప్రజలు వికారం, వాంతులు వంటి లక్షణాలు.. కొన్నిసార్లు పల్స్ రేటు పెరుగుతుంది.. కానీ రుచి, వాసన కోల్పోవడం లేదు. దాని తీవ్రత అంతగా లేనందున తక్కువ మంది ఆసుపత్రిలో చేరారు’ అని చెప్పారు. ఆయనకంటే ముందుగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వంద మంది ప్రయాణికుల్లో ఒకరిలో ఆ వైరస్‌ ఉన్నా అది రాష్ట్రానికి పిడుగులాంటి వార్తే. మరో తప్పిదానికి అవకాశం ఇవ్వకూడదని సర్కారు కొత్త నిబంధనలను మళ్లీ తెరపైకి తెచ్చింది. డిసెంబరు తొలివారం నుంచి కర్ణాటకలో మరోసారి లాక్‌డౌన్‌ అమలవుతుందన్న వార్తలు దావానలంలా వ్యాప్తించాయి. వీటిని ముఖ్యమంత్రితో సహా ఆరోగ్యశాఖ కూడా ఎప్పటికప్పుడు కొట్టిపారేయడం గమనార్హం. రెండేళ్లుగా ఆర్థిక సమస్యలతో తల్లడిల్లిన ప్రజలను మరోమారు సమస్యల్లో తోసేయబోమని, సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతూనే ఉన్నారు. పాఠశాలలు, కళాశాలలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, నిబంధనల అమలులో అలసత్వంగా ఉండరాదని అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు. రెవెన్యూ, ఆరోగ్య, హోంశాఖలు సమన్వయంగా రానున్న కొత్త వైరస్‌ ఉపద్రవాన్ని నియంత్రించే వ్యవస్థలను రూపొందించామని ప్రకటించారు. మరోవైపు, దక్షిణాఫ్రికా, బోట్సవానా, హాంకాంగ్‌ల నుంచి ప్రయాణికులపై నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరారు.


By November 30, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/south-africa-passenger-has-tested-positive-for-strain-different-than-delta-says-karnataka-minister/articleshow/87994235.cms

No comments