Breaking News

మహిళా ఎంపీలతో సెల్ఫీ.. కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యలతో దుమారం


సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. తాజాగా, ఆయన మహిళా ఎంపీలతో ఫోటో దిగి.. దానిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ‘మహిళా ఎంపీలు ఉండగా.. లోక్‌సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు’ అంటూ ఆయన చేసిన కామెంట్‌పై మండిపడుతున్నారు. ఈ విమర్శలపై స్పందించిన శశిథరూర్‌.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ట్విట్టర్‌లో కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా ఈ సందర్భంగా లోక్‌సభ ప్రాంగణంలోని మహిళా ఎంపీలు.. సీనియర్‌ సభ్యుడు శశిథరూర్‌తో సెల్ఫీ దిగారు. వీరిలో ఎన్సీపీ, టీఎంసీలకు చెందిన ఎంపీలు సుప్రియా సూలే, ప్రణీత్‌ కౌర్‌, తమిజాచి తంగపాండియన్‌, మిమి చక్రవర్తి, నుస్రత్‌ జహాన్‌, జ్యోతిమణి ఉన్నారు. ఈ సెల్ఫీని ట్విటర్‌లో షేర్‌ చేసిన శశిథరూర్‌.. లోక్‌సభ ఆకర్షణీయమైన పని ప్రదేశం కాదని ఎవరన్నారు? అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించడంతో వివాదాస్పదమయ్యింది. ముఖ్యంగా మహిళలను కించపరిచేలా శశిథరూర్‌ కామెంట్ చేశారని ఆయన తీరుపై కొందరు నెటిజన్లు మండిపడ్డారు. మహిళల పట్ల వివక్ష భావనతోనే శశిథరూర్‌ అలా వ్యాఖ్యానించారని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మ కూడా స్పందించారు. ‘పార్లమెంటుతో పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్న మహిళలను ఆకర్షణీయ వస్తువుగా పేర్కొంటూ కించపరిచారు. పార్లమెంటులో మహిళలను ఇలా అవమానించడం ఆపండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శశిథరూర్‌ వ్యాఖ్యలపై అటు సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నందీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా ఎంపీల రూపంపై కామెంట్లు చేస్తూ.. విషయాన్ని తనవైపు కేంద్రీకరించుకొని ప్రయోజనం పొందేందుకే ఆయన ప్రయత్నించారని విమర్శించారు. దీనికి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా.. కౌంటర్ ఇస్తూ కొన్ని విషయాలను తేలికగా తీసుకోవాలంటూ కరుణా నందీకి సూచించారు. ప్రతిదాన్నీ భూతద్దంలో చూడొద్దని.. పార్లమెంటులో మహిళా సభ్యులందరికి ఇదో అభినందనగా భావించాలనేది నా అభిప్రాయం అంటూ గుత్తా జ్వాలా పేర్కొన్నారు. కాగా, విమర్శలు రావడంతో శశిథరూర్‌ స్పందించారు. ‘అందరం కలిసిన సందర్భంగా వారి చొరవతోనే సరదాగా ఆ సెల్ఫీ దిగాం... అదే స్ఫూర్తితో ఆ ఫొటోపై ట్విట్‌ చేయమని వారే నన్ను కోరారు. ఆ వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి. అయినప్పటికీ పని ప్రదేశంలో అలా చోటుచేసుకున్న సరదా సంభాషణలో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని బదులిచ్చారు.


By November 30, 2021 at 08:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-mp-shashi-tharoors-selfie-with-six-women-mps-tweet-sparks-row/articleshow/87994524.cms

No comments