Breaking News

కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన మలాలా.. ఈయనే నా భాగస్వామి అంటూ పరిచయం


నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలికల విద్య కోసం పోరాడుతున్న హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వివాహం చేసుకున్నట్టు మలాలా వెల్లడించారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో గల తన నివాసంలో కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈ మేరకు తన జీవితభాగస్వామి అస్సర్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ఈవిషయాన్ని పంచుకున్నారు. ‘‘ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది.. అస్సర్‌, నేను జీవిత భాగస్వాములు అయ్యాం.. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం.. మీ ఆశీస్సులు మాకు పంపించండి.. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం’’ అని మలాలా ట్వీట్‌ చేశారు. తన భర్త అస్సర్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశారు. పాకిస్థాన్‌లోని స్వాత్‌ లోయలో జన్మించిన మలాలా బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో పాఠశాల బస్సులోకి చొరబడిన తాలిబన్లు ఆమెపై కాల్పులకు పాల్పడ్డారు. మలాలా ఎడమ కణతిపై, శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే పెషావర్‌కు తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అయితే బుల్లెట్‌ గాయాలకారణంగా మెరుగైన చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. అనంతరం బ్రిటన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి మలాలా బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్‌ పేరుతో బాలికల విద్యకోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఈ క్రమంలో తన సేవలను గుర్తించిన నోబెల్‌ కమిటీ 2014లో మలాలాకు నోబెల్‌ శాంతి బహుమతిని అందించింది. దీంతో 17 ఏళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మాలాలా చరిత్ర సృష్టించారు. 2020లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా ఆమె ప్రతిభ, ధైర్యాన్ని మెచ్చుకొని, జులై 12వ తేదీని మలాలా డేగా ప్రకటించింది. 2009లో మలాలా బీబీసీ ఉర్దూ బ్లాగ్‌లో తాలిబన్లు ఆక్రమించిన స్వాత్‌ లోయలో తాము పడుతున్న బాధల గురించి మారుపేరుతో వివరంగా రాసింది. అప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు. అది చదివిన జర్నలిస్టు ఆడమ్‌ బి.ఎలిక్‌ న్యూయార్క్‌ టైమ్స్‌లో అక్కడి ప్రజల నిత్యజీవితంపై తీవ్రవాదుల ప్రభావం ఎలా ఉందో వివరిస్తూ డాక్యుమెంటరీ తీశాడు. అందులో మలాలా ఇచ్చిన ఇంటర్వ్యూ టెలివిజన్‌లో, పత్రికలలో వచ్చింది. అందుకు ఆమె ‘అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి ఎంపికయింది. 2012, అక్టోబర్‌ 9న పరీక్ష రాసేందుకు పాఠశాలకు స్నేహితురాళ్లతో మలాలా బస్సులో బయలుదేరింది. తమపై చేస్తున్న ప్రచారానికి ప్రతీకారం తీర్చుకునేందుకు మలాలాను హత్యచేయాలని వచ్చిన తాలిబన్లు ఆమెపై కాల్పులు జరిపారు.


By November 10, 2021 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/nobel-winner-malala-yousafzai-tie-knot-with-asser-announce-wedding-in-uk-see-pics/articleshow/87617542.cms

No comments