ఎస్సైను కొడవలితో నరికి హత్యచేసిన మేకల దొంగలు.. రూ.కోటి ఆర్దిక సాయం ప్రకటించిన సీఎం
ఓ పోలీస్ అధికారిని బంధించి, అత్యంత కిరాతకంగా దొంగలు హత్యచేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున తిరుచ్చి జిల్లా నవల్‌పట్టుకు చెందిన ప్రత్యేక ఎస్సై భూమినాథన్ (55)ను మేకల దొంగలు కొడవలితో నరికి హత్య చేశారు. నవల్‌పట్టు పోలీస్ స్టేషన్ ఎస్సై భూమినాథన్ శనివారం రాత్రి పుదుక్కోట్టై జిల్లా కీరనూర్ సమీపంలోని కలమావూర్ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున బైకుపై మేకతో వెళుతున్న ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, వాళ్లు వాహనం ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో భూమినాథన్, మరో పోలీస్ చిత్తిరైవేల్ వారిని వెంబడించారు. ఈ క్రమంలో తిరుచ్చి జిల్లా సరిహద్దు పుదుక్కోట్టై కీరనూర్ ప్రాంతంలోని పళ్లత్తుపట్టి వద్ద భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన సబ్‌వేను దాటలేక దొంగలు చిక్కుకుపోయారు. ఈ సమయంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన భూమినాథన్‌పై దొంగలు దాడిచేశారు. ఆయనను బంధించి అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపు భూమినాథన్‌ను కొడవలితో కిరాతకంగా నరికి హత్య చేసి పరారయ్యారు. ఆదివారం ఉదయం స్థానికులు ఎస్సై మృతదేహం చూసేవరకూ ఆయన చనిపోయినట్టు అధికారులు గుర్తించలేకపోయారు. కీరనూర్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం తిరుచ్చి జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూమినాథన్ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని స్టాలిన్ ప్రకటించారు. నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోడానికి 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాాచారం. ఎస్సై భూమినాథన్ స్వగ్రామం తిరుచ్చి సోలమానగర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్సై మృతిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల హత్యలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన కోరారు. ఈ ఏడాది జనవరిలోనూ కన్యాకుమారి జిల్లా కలియక్కావిలై సమీపంలోని పడతలమూడు చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ప్రత్యేక ఎస్సై విల్సన్ హత్యకు గురయ్యారు. ఓ వ్యక్తి కారు నుంచి దిగి విధుల్లో ఉన్న ఎస్సైపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
By November 22, 2021 at 11:12AM
No comments