Breaking News

అఫ్గన్‌పై భారత్ సమావేశం.. ఉగ్రవాదంపై కుండబద్దలు కొట్టిన ఢిల్లీ డిక్లరేషన్


అఫ్గన్ పరిస్థితులపై భారత్ బుధవారం నిర్వహించిన జాతీయ భద్రతా సలహాదారుల ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గన్‌ కేంద్రంగా మారకూడదని ఈ సమావేశంలో పాల్గొన్న భారత్‌ సహా ఎనిమిది దేశాలు సంయుక్తంగా వెలువరించిన ‘ఢిల్లీ డిక్లరేషన్‌’ స్పష్టం చేసింది. అఫ్గన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటుచేసి, మైనార్టీ తెగలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశాయి. డ్రగ్స్ రవాణాను అడ్డుకోవాలని పిలుపునిచ్చాయి. భారత్ నిర్వహించిన ఈ సమావేశంలో రష్యా, ఇరాన్‌, మధ్యాసియా దేశాలైన తజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పాల్గొన్నాయి. దాయాది పాకిస్థాన్‌, పొరుగు దేశం చైనాను భారత్‌ ఆహ్వానించినా.. ఆ రెండూ హాజరుకాలేదు. ఢిల్లీలో జరిగిన సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్ అధ్యక్షత వహించారు. అఫ్గన్‌ సుస్థిరత ఈ ప్రాంతానికి చాలా కీలకమని అజిత్ దోవల్ ఈ సందర్భంగా అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గన్‌ కేంద్రం కాకూడదని ఉద్ఘాటించారు. ఉగ్ర శిక్షణ, ఆశ్రయం కల్పించడం, ఇతర దేశాలపై దాడులకు కుట్రలు, ఆర్థిక సహాయం సహా ఎలాంటి కార్యకలాపాలు అక్కడ చేపట్టరాదని డిక్లరేషన్‌లో స్పష్టం చేశారు. ‘శాంతియుత, సురక్షిత, సుస్థిర అఫ్గన్‌కు మద్దతు ఇస్తాం... ఆ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను గౌరవిస్తాం.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం.ఈ సంక్షోభ పరిష్కారంలో ఐక్యరాజ్యసమితిది కీలక పాత్ర.. అఫ్గన్‌లో ఐరాస విభాగాలు తమ కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలి.. అఫ్గన్‌ ప్రజలకు వివక్ష లేకుండా మానవతా సహాయాన్ని అందించాలి.. కుందుజ్‌, కాందహార్‌, కాబుల్‌లో ఉగ్రదాడులను ఖండిస్తున్నాం.. మహిళలు, చిన్నారులు, మైనార్టీ తెగల ప్రాథమిక హక్కులను కాపాడాలి’ అని పేర్కొంది. అఫ్గన్‌పై 2018 నుంచి జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమావేశాలు జరుగుతుండగా.. తొలి రెండు సమావేశాలకు ఇరాన్‌ ఆతిథ్యమిచ్చింది. ఇందులో పాక్ పాల్గొనకపోయినా.. చైనా మాత్రం హాజరవుతూ వచ్చింది. ఈసారి భారత్‌లో జరిగిన సమావేశానికి మాత్రం చైనా కుంటి సాకుతో తప్పించుకుంది. షెడ్యూలింగ్‌ సమస్యలతోనే హాజరుకావడం లేదని పేర్కొంది. అయితే పాక్‌కు మద్దతుగానే చైనా ఈ నిర్ణయం తీసుకుందని.. అఫ్గన్‌ ప్రజలకు అండగా నిలుస్తున్న భారత్‌ను అడ్డుకోవాలన్నదే ఈ రెండు దేశాల వ్యూహమని నిపుణులు చెబుతున్నారు. భారత్ సమావేశానికి హాజరైన దేశాల ప్రతినిధులు సైతం పాక్, చైనా తీరును తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ద్వైపాక్షిక ఎజెండా ప్రకారం జాతీయ భద్రతా సలహాదారు స్థాయి సమావేశానికి గైర్హాజరుకాకూడదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇక, సమావేశం అనంతరం అజిత్ దోవల్‌తో పాటు ఏడు దేశాల ప్రతినిధులు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నాలుగు సూచనలు చేశారు. కాబుల్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, అఫ్గన్ భూభాగాన్ని తీవ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. డ్రగ్స్‌, అక్రమ ఆయుధాల సరఫరాను నిరోధించే వ్యూహాన్ని రూపొందించాలని తెలిపారు. అదే సమయంలో అఫ్గన్‌లో నెలకొన్న మానవతా సంక్షోభంపైనా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు.


By November 11, 2021 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/afghanistan-territory-shouldnt-be-used-for-terrorism-say-nsas-in-delhi-declaration/articleshow/87637711.cms

No comments