Breaking News

హైవేపై వర్షంలా కరెన్సీ నోట్లు.. ఎగబడి ఏరుకున్న జనం.. ఎక్కడంటే?


జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న సాయుధ ట్రక్కు నుంచి నగదు సంచులు జారిపడి, రోడ్డుపై నోట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తున్నవారు ఆగిపోయి డబ్బులు ఏరుకోవడానికి పోటీపడ్డారు. కొందరు ఏకంగా కరెన్సీ ఏరుకునే క్రమంలో పోట్లాటకు దిగారు. ఈ ఘటన అమెరికాలోని దక్షిణ కార్ల్స్‌బడ్‌లో చోటుచేసుకుంది. శాన్‌డిగో నుంచి ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి నగదు సంచులతో వెళ్తుండగా ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. ‘‘ట్రక్కు డోరు ఒకటి తెరచుకోవడంతో నగదు సంచులు బయటపడ్డాయి’’ అని కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్‌ అధికారి కర్టిస్‌ మార్టిన్‌ పేర్కొన్నారు. రోడ్డుపై చెల్లచెదురుగా పడిన కరెన్సీని తీసుకున్న కొందరు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని మార్టిన్‌ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశామన్నారు. ఎవరైనా నగదు తీసుకున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపైనా క్రిమినల్‌ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. పోయిన నగదు ఎంత అనేది మాత్రం అధికారులు చెప్పలేదు. రోడ్డుపై పడిపోయిన కరెన్సీలో ఒక డాలరు, 20 డాలర్ల నోట్లే ఎక్కువగా ఉన్నాయని చూసినవారు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు.. నగదు తీసుకున్న వారిలో దాదాపు 12 మంది వెనక్కి తిరిగి ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు, నగదు తీసుకున్నవారు వెనక్కు ఇచ్చేయాలని కోరారు. ఈ ఘటనపై సీహెచ్‌పీ, ఎఫ్‌బీఐలు దర్యాప్తు చేపట్టాయి. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసిన డెమి బగ్బై అనే ఓ బాడీ బిల్డర్.. ‘హైవేపై డబ్బులు ఏరుకోడానికి అందరూ ఆగిపోవడం నేను ఇప్పటి వరకూ చూడని అత్యంత వెర్రితనం’ అని వ్యాఖ్యానించాడు. తాజాగా ఘటనతో కాలిఫోర్నియా జాతీయ రహదారిని రెండు గంటల పాటు అధికారులు మూసివేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఎరుకోగా మిగిలిన కరెన్సీ నోట్లను సేకరించిన అనంతరం హైవేను తెరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


By November 21, 2021 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/scramble-as-cash-rains-from-armoured-truck-in-carlsbad-california-of-us/articleshow/87826963.cms

No comments