కేదార్‌నాథ్‌లో ప్రధాని.. ఆది శంకరాచార్య విగ్రహం ఆవిష్కరణ
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మోదీ ప్రత్యేకపూజలు నిర్వహించారు. కేదారేశ్వరస్వామికి ప్రధాని హారతిని సమర్పించారు. ఆలయ సందర్శన అనంతరం ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్‌లో 2013 వరదల సమయంలో దెబ్బతిన్న ఆది శంకరాచార్య సమాధిని పునఃనిర్మించారు. 12 అడుగుల ఎత్తులో 35 టన్నుల విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఇక, కేదార్‌నాథ్‌లో రూ. 400 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మహనీయుల చరిత్రను మననం చేసుకుందామని, ఆది శంకరాచార్య రచనలు ఐక్యతను గుర్తుచేస్తాయని ప్రధాని అన్నారు. ఉపనిషత్తుల్లో కనిపించే ఆలోచనలను విశదీకరిస్తాయని, ఆది శంకరాచర్య రచనలు ఎంతో మందిని ప్రభావితం చేస్తాయన్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనతో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని మోదీ అన్నారు. ‘ఈరోజు ఇక్కడ జరిగిన ఆదిశంకరాచార్య సమాధి ప్రారంభోత్సవానికి మీరందరూ సాక్షులు.. ఆయన భక్తులు ఆత్మీయంగా ఇక్కడ ఉన్నారు.. దేశంలోని అన్ని 'జ్యోతిర్లింగాలు' నేడు మనతో అనుసంధానమై ఉన్నాయి’ అని అన్నారు. ‘2013 విధ్వంసం తర్వాత, కేదార్‌నాథ్‌ను తిరిగి అభివృద్ధి చేయవచ్చా అని ప్రజలు ఆలోచించారు.. కానీ కేదార్‌నాథ్ మళ్లీ అభివృద్ధి చెందుతుందని నా మనసు ఎప్పుడూ చెబుతోంది’ అన్నారు.
By November 05, 2021 at 10:48AM
No comments