Breaking News

పేలుళ్లకు పాల్పడిన ప్రియుడ్ని పట్టించాను... రివార్డు నాకే ఇవ్వాలి.. కోర్టుకు ప్రేయసి!


గతేడాది క్రిస్మస్ సందర్భంగా జరిగిన పేలుళ్ల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. సంచలనం సృష్టించిన నాష్‌విల్లే డౌన్‌టౌన్లో పేలుళ్లకు ఆంథోని వార్నర్ అనే వ్యక్తి కారణమని పోలీసులు దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే, అతడి ప్రేయసి తనకు రివార్డ్ ఇప్పించాలంటూ తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు డేవిడ్‌సన్ కౌంటీ ఛాన్సరీ కోర్ట్‌లో ఈ పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడి గురించి సమాచారం ఇస్తే రివార్డు అందజేస్తామని భద్రతా అధికారులు అప్పట్లో ప్రకటించారు. దీంతో ఆ రివార్డును కోరుతూ ఆమె కోర్టులో దావా వేసింది. పేలుళ్లకు పాల్పడిన వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు సంస్థలకు సహకరించానని, తనకు రావాల్సిన 2,84,000 డాలర్ల రివార్డ్ను వెంటనే చెల్లించాలని ఆమె తన పిటిషన్లో కోరింది. వ్యక్తిగతంగా తనకు ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ముందుకు వచ్చానని పేర్కొంది. నిందితుడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి పలు సంస్థలు భారీ రివార్డును ప్రకటించాయి. ‘క్యాంపింగ్ వరల్డ్’ సీఈఓ మార్కస్ లెమోనిస్ 2,50,000 డాలర్లు, నాష్‌విల్లే కన్వెన్షన్, విజిటర్స్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా 34,500 డాలర్లు అందజేస్తామని వెల్లడించాయి. చెప్పినట్టుగానే నాష్‌విల్లే కన్వెన్షన్, విజిటర్స్ కార్పొరేషన్ 34,500డాలర్లను పోలీసులు, ఇతర భద్రతా అధికారులకు అందించింది. పమేలా పెర్రీ పిటిషన్‌పై స్పందించిన నాష్‌విల్లే కన్వెన్షన్ సీఈఓ స్పైరిడాన్.. వార్నర్ ప్రియురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పేలుళ్లకు పాల్పడిన నిందితుడిని గుర్తించారా? లేదా? అనేది స్పష్టత లేదన్నారు. అంతేకాదు, పేలుళ్లకు సంబంధించి ఖచ్చితమైన, విలువైన సమాచారం అందించిన వారికి రివార్డ్ ఇస్తానని చెప్పినట్లు మార్కస్ లెమోనిస్ పేర్కొంది. నిందితుడిని సజీవంగా పట్టుకోలేదని.. పేలుళ్లలో చనిపోయాడని గుర్తుచేసింది. డిసెంబరు 25న నాష్‌విల్లే ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడితో పాటు.. మరో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. వందల కిలోమీటర్ల మేర రోజులపాటు ఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి పోలీసులకు సమాచారం వచ్చింది. వాటికి స్పందిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో గాలింపులు చేపడుతుండగా.. అక్కడే నిలిపి ఉంచిన ఓ రిక్రియేషనల్‌ వ్యాన్‌ నుంచి బాంబు పేలుడుకు సంబంధించిన ప్రకటన వచ్చినట్టు గుర్తించారు. ‘‘మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది’’ అంటూ రికార్డ్ చేసి ఉంచిన సందేశం వినబడింది.


By November 22, 2021 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ex-girlfriend-of-nashville-bomb-blast-accused-warner-files-suit-over-reward/articleshow/87839853.cms

No comments