Breaking News

ఐఎస్ఐ ఏజెంట్‌గా మారిన రాజస్థానీ.. పాకిస్థాన్‌లో శిక్షణ!


పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలపై రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైసల్మేర్‌కు చెందిన పాక్‌ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)‌తో కలిసి చాలా కాలం నుంచి పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. జైసల్మేర్‌లో చిన్న దుకాణం నడుపుతున్న నిందితుడు.. సిమ్ కార్డులు ఇతర వస్తువులు అమ్ముతుంటాడని తెలిపారు. ఖాన్ 2015లో పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు అక్కడ హ్యాండ్లర్‌తో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ సమయంలో పదిహేను రోజుల పాటు వారి వద్ద శిక్షణ తీసుకున్నాడని, అందుకు రూ.10,000 ఇచ్చారని వెల్లడయ్యింది. అక్కడ నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత గూఢచర్యానికి పాల్పడుతూ భారత ఆర్మీకి సంబంధించిన స్థానిక కార్యకలాపాలు, కదలికలను ఎప్పటికప్పుడూ పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్టు తేలింది. సోషల్ మీడియా ద్వారా పాక్‌కు వీటిని పంపుతున్నట్టు గుర్తించారు. నిందితుడ్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌పై ఇంటెలిజెన్స్ విభాగం డీజీపీ ఉమేశ్ మిశ్రా మాట్లాడుతూ.. నిందితుడు నిబాబ్ ఖాన్ జైసల్మేర్‌లో చిన్న దుకాణం నడుపుతున్నాడని తెలిపారు. పాకిస్థాన్ ఐఎస్ఐ‌కు అనుబంధంగా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడని, సైనికుల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంపుతున్నట్టు గుర్తించామన్నారు. పాక్‌లో రెండు వారాలు శిక్షణ తీసుకున్న విషయం దర్యాప్తులో వెల్లడయ్యిందన్నారు. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం బయటపడుతుందని డీజీపీ అన్నారు.


By November 28, 2021 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rajasthan-man-arrested-in-jaisalmer-for-spying-for-isi-was-trained-in-pakistan/articleshow/87957509.cms

No comments