Breaking News

ప్రపంచాన్ని చుట్టేస్తున్న ‘ఒమిక్రాన్’.. కేసుల నమోదుతో ఆంక్షల్లోకి పలు దేశాలు


దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ‘ఒమిక్రాన్‌’ ఊహించినట్టు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాలకు ఇప్పటికే విస్తరించిన ఈ వేరియంట్.. క్రమంగా మిగతా చోట్లకు విస్తరిస్తోంది. తాజాగా జర్మనీలో ఒకరు ఒమిక్రాన్‌ బారిన పడగా.. బ్రిటన్‌లో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. వేరియంట్‌ బోట్స్‌వానా, బెల్జియం, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌లకు వ్యాపించింది. దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్‌‌కు వచ్చిన విమానంలోని 61 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇది వేరియంట్‌ అనేది నిర్ధారించాల్సి ఉంది. చెక్, ఇటలీలోనూ ఒక్కో కేసు బయటపడింది. పలు మ్యుటేషన్లు కలిగిన ఈ వేరియంట్‌ చాలా శక్తిమంతమైందని... పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నవారికి, ఒకసారి కొవిడ్‌ బారిన పడినవారికి కూడా ఇది సోకవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి. పరీక్షల్ని ముమ్మరం చేశాయి. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. పలు ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయులు రావొద్దని బ్రిటన్‌, అమెరికా, రష్యా, జపాన్‌, ఆస్ట్రేలియాలు ప్రకటించాయి. విమాన సర్వీసుల్ని ఆపేస్తుండడంతో అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోతున్నారు. బ్రిటన్‌లో తొలిసారిగా శనివారం రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో అంగోలా, మొజాంబిక్‌, మలావీ, జాంబియాల నుంచి కూడా విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్‌ ప్రకటించింది. కొత్త వేరియంట్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి పలు దేశాలు ప్రయాాణాలను నిలిపివేశాయి. దీంతో పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సభ్యులను కలిసే నిమిత్తం దక్షిణాఫ్రికా వచ్చిన వందల మంది విదేశీయులు అక్కడ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. కొన్నిదేశాలు తమ పౌరులను మాత్రమే అక్కడి నుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నాయి. భారత్‌ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోంది. కొవిడ్‌కు ముందు షెడ్యూలు అయిన ప్రయాణికుల విమానాల్లో సగం మాత్రమే దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌ నుంచి రాకపోకలు సాగించేలా అనుమతించాలని నిర్ణయించింది. మరోవైపు, ప్రపంచ దేశాలు తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా తీవ్రంగా ఆక్షేపించింది. ముందుగానే ప్రపంచాన్ని హెచ్చరించినందుకు తాము శిక్ష అనుభవిస్తున్నామని వాపోయింది. ఇది తప్పుడు నిర్ణయమని, డబ్ల్యూహెచ్‌వో నియమావళికి విరుద్ధమని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జోఫాహ్లా వ్యాఖ్యానించారు. ప్రపంచ సమస్యను కలిసి పరిష్కరించాల్సిన తరుణంలో కొన్ని దేశాలు బలిపశువులను వెతుకుతున్నాయని పేర్కొన్నారు.


By November 28, 2021 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/these-countries-report-cases-of-omicron-variant-of-coronavirus/articleshow/87957214.cms

No comments