Breaking News

అత్యంత అరుదైన ఘటన.. తోకతో జన్మించిన శిశువు.. వైద్యులు షాక్


ఓ శిశువు తోకతో జన్మించిన అత్యంత అరుదైన ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. శిశువు తోకతో జన్మించడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఫోర్ట్‌లెజా పట్టణానికి చెందిన 35 వారాల గర్భిణి పురుటినొప్పులతో ఆల్బెర్ట్‌ సాబిన్‌ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. ఆమెకు అక్కడ వైద్యులు శస్త్రచికిత్సను నిర్వహించి మగ శిశువును బయటకు తీశారు. అయితే ఆ బాలుడికి తోక ఉండటం చూసి వైద్యులు విస్తుపోయారు. 12 సెంటీమీటర్లు పొడవున్న తోక చివర 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో బంతి లాంటి ఆకారం కూడా ఉంది. గర్బిణిగా ఉన్నప్పుడు ఆ మహిళకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో తోక ఆనవాళ్లు బయటపడలేదని వైద్యులు తెలిపారు. ఆ తోకను ‘నిజమైన ’గా అభివర్ణిస్తున్నారు. అయితే చర్మానికి మాత్రమే తోక పెరిగిందని, నాడీ వ్యవస్థకు తోకతో ఎలాంటి అనుసంధానం లేదని అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించినట్లు వెల్లడించారు. శిశువు సాధారణ సమాయానికి ముందే భూమ్మీదకు వచ్చినా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని వివరించారు. శిశువు గర్బంలో ఉన్నప్పుడు దాదాపు నాలుగు నుంచి ఎనిమిది వారాలప్పుడు ఇలాంటి 'తోక' పెరుగుతాయని వైద్యులు చెప్పారు, అయితే అవి సాధారణంగా శరీరంలోకి తిరిగి వెళ్లి, దీని ఫలితంగా వెన్నెముక కింద ముడ్డి ఎముకగా ఏర్పడుతుంది. కానీ ఇలాంటి చాలా అరుదైన సంఘటనలలో మాత్రం తోక పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు నమోదయిన రికార్డుల ప్రకారం కేవలం 40 మంది పిల్లలు మాత్రమే అలాంటి తోకలతో జన్మించారు. ఇవి కొవ్వు, బంధన కణజాలం, రక్త నాళాలు, కండరాలు, నరాల ఫైబర్‌లతో కూడి ఉంటాయి. ఈ విషయాన్ని పీడియాట్రిక్స్ కేస్ సర్జరీ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు. ‘నవజాత శిశువులలో తోక ఉనికి అరుదుగా ఉంటుంది.. దీనిని సమగ్ర పద్ధతిలో భౌతిక, రేడియోలాజికల్ పరీక్షల ద్వారా పరిశోధించాలి.. చర్మం, కేంద్ర నాడీ వ్యవస్థకు మధ్య ఉన్న సాధారణ ఎక్టోడెర్మల్‌‌లో గాయమైనట్టు అనుమానించిన రోగులలో వెన్నెముక డైస్రాఫిజం ఉనికిని తెలుసుకోవడం చాలా అవసరం.. ఎందుకంటే అవి మాత్రమే అసాధారణ నరాల మార్పుల పరిణామాన్ని నిరోధించగలవు’’అని జర్నల్‌లో పేర్కొన్నారు.


By November 07, 2021 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/baby-boy-born-with-long-human-tail-in-brazil-successfully-removed-by-operation/articleshow/87564104.cms

No comments