ఆహ్వానించిన ఆటోవాలా.. సామాన్యుడిలా భోజనానికి వెళ్లిన సీఎం
పంజాబ్‌లో పర్యటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి .. సామాన్యుడి మాదిరిగా ఆటో రిక్షాలో ఎక్కారు. లూథియానాలో ఓ ఆటో ఎక్కిన కేజ్రీవాల్.. నగర విధుల్లో తిరిగారు. అనంతరం ఆ ఆటో డ్రైవర్ ఇంట్లోనే భోజనం చేశారు. సీఎం తమ ఇంట్లో భోజనం చేయడంపై ఆటో డ్రైవర్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనన్న నేపథ్యంలో కేజ్రీవాల్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించిన ఆప్.. ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. కేజ్రీవాల్ తన ఆటోలో ఎక్కడంతో ఆటోవాలా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ‘సార్ నేను మీకు పెద్ద అభిమానిని.. ఆటో డ్రైవర్లకు సాయం చేయండి.. ఈ పేద ఆటోవాలా ఇంటికి భోజనానికి రావాలి.. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను’ అని ఆటోవాలా అన్నాడు. దీనికి సరేనన్న కేజ్రీవాల్.. తప్పకుండా ఈ రాత్రికే భోజనానికి వస్తానని మాట ఇచ్చారు. చెప్పినట్టుగానే కేజ్రీవాల్ అతడి ఇంటికి వెళ్లడంతో ఆటోవాలా కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యింది. అంతేకాదు, వారిని కూడా తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించారు. ఆటోవాలా దిలీప్ తివారీ ఇంట్లో భోజనం చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ట్విట్టర్‌లోనూ పంచుకున్నారు. ‘‘ఆ కుటుంబం తనపై ఎంతో ప్రేమను కురిపించింది.. భోజనం చాలా రుచిగా ఉంది.. వారిని కూడా ఢిల్లీకి ఆహ్వానించాను’’ అని తెలిపారు. ‘నేను మీకు సోదరుడిలాంటి వాడిని.. ఏ సాయం కోసమైనా నన్ను కలవొచ్చు.. ఒకవేళ ఆటో రిపేర్ వచ్చినా’అని కేజ్రీవాల్ ప్రకటించారు.
By November 23, 2021 at 10:32AM
No comments