Breaking News

చనిపోయిన వ్యక్తిని గెలిపించి.. యువకుడి చివరి కోరిక నెరవేర్చిన గ్రామస్థులు!


పంచాయతీ ఎన్నికల్లో గెలవాలన్న ఓ యువకుడి కోరిక నెరవేరక ముందే విధి చిన్నచూపు చూడటంతో అతడు ఈ లోకాన్ని వదలివెళ్లిపోయాడు. నామినేషన్ వేసిన తర్వాత పోలింగ్‌కు ముందు చనిపోయాడు. నవంబరు 24న పోలింగ్‌ జరగనుండగా.. అతడు నవంబరు 6న మృతి చెందాడు. దీంతో గ్రామస్థులంతా మృతి చెందిన వ్యక్తికే ఓట్లు వేసి గెలిపించి అతడి చివరి కోరికను తీర్చారు. సానుభూతి యువకుడ్ని ఎన్నికల్లో విజేతగా నిలిపిన ఈ ఘటన బిహార్‌లోని జమూయి జిల్లాలో చోటుచేసుకుంది. నక్సల్స్‌ ప్రభావిత గ్రామమైన దీపాకర్హర్‌కి చెందిన సోహన్‌ ముర్ము బిహార్ పంచాయతీ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బరిలో నిలిచాడు. అయితే, అతడు నవంబరు 6న మృతిచెందిన విషయం అధికారులు తెలియజేయకపోవడంతో యథావిధిగా నవంబరు 24న ఎన్నిక నిర్వహించారు. పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడిన అనంతరం అధికారులు విచారించగా.. ముర్ము మృతి చెందినట్లు తేలింది. దీంతో అధికారులు షాకయ్యారు. అంతేకాదు, అతడి చివరి కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో సోహన్‌ను గెలిపించారు. ‘‘తన ప్రత్యర్థిని ఎన్నికల్లో ఓడించాలనేది ముర్ము చివరి కోరిక.. 28 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.. ముర్ము మృతి చెందిన విషయాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులు మా దృష్టికి తీసుకురాలేదు. ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు గ్రామస్థులంతా అనుకూలంగా ఓట్లు వేసి గెలిపించినట్లు ఉంది’’ అని ఖైరా ఎన్నికల అధికారి రాఘవేంద్ర త్రిపాఠీ పేర్కొన్నారు. కానీ, విజేతను ప్రకటించని అధికారులు సంబంధిత వార్డు ఎన్నికను రద్దు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులు, తోటి గ్రామస్థుల అమాయకత్వం వల్ల ఇది అధికారులకు మరింత పని భారం పెంచిందని ఆయన అన్నారు. ఝార్ఖండ్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలో ప్రధానంగా గిరిజన సామాజిక వర్గం ఎక్కువ. 90వ దశకంలో మావోయిస్టుల కార్యకలాపాలు ప్రారంభం కాగా.. నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతంగా తర్వాత గుర్తింపు పొందింది.


By November 28, 2021 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/villagers-vote-to-honour-his-last-wish-dead-man-wins-panchayat-poll-in-bihar/articleshow/87958597.cms

No comments