కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా.. అభినందన్ వర్దమాన్‌కు ప్రమోషన్
పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ స్ట్రయిక్స్ అనంతరం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ధైర్యసాహసాలు భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ప్రమోషన్ లభించింది. అభినందన్‌ను గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అనేది సైన్యంలో కల్నల్‌తో సమానం. బాలాకోట్‌పై భారత్ ఎయిర్ స్ట్రయిక్స్ చేసిన మర్నాడు 2019 ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం ఎఫ్-16 యుద్ధ విమానంతో భారత్‌పై దాడికి ప్రయత్నించింది. పాక్ యుద్ధ విమానాన్ని భారత వైమానికదళ కమాండర్ అభినందన్ మిగ్-21 విమానంతో వెంబడించి నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో దూకేయగా అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అభినందన్‌ను అప్పగించాలని భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో దాయాది దిగిరాక తప్పలేదు. అదే ఏడాది మార్చి 1న అభినందన్‌ను పాక్ సైన్యం అప్పగించిన తర్వాత.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి విధుల్లోకి చేరి దేశసేవను కొనసాగిస్తున్న క్రమంలోనే అభినందన్‌కు పదోన్నతి లభించింది. పాక్‌తో పోరాటంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది.
By November 04, 2021 at 10:46AM
No comments