సాగు చట్టాల రద్దుపై మోదీ ప్రకటన.. అమెరికా నేత సంచలన వ్యాఖ్యలు
నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సాగు చట్టాల రద్దుచేస్తామన్న మోదీ ప్రకటనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఏడాదికిపై నిరసనల అనంతరం మూడు సాగు చట్టాలను భారత్ రద్దుచేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. భారత్, ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసికట్టుగా పోరాడితే కార్పొరేట్ ప్రయోజనాలను ఓడించి, విజయం సాధించగలరనడానికి ఇదే రుజువని లెవిన్ వ్యాఖ్యానించారు. ‘ఏడాదికిపై నిరసనల అనంతరం మూడు సాగు చట్టాలను భారత్ రద్దుచేయడం సంతోషకరం.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కలిసికట్టుగా పోరాడితే కార్పొరేట్ ప్రయోజనాలను ఓడించి, పురోగతిని సాధించగలరనడానికి ఇది రుజువు’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించిన .. జాతికి క్షమాపణ చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు ఏడాది కాలంగా నిరసన చేపడుతున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని ఆయన అభ్యర్థించారు. అయితే, రైతు సంఘాల నేతలు మాత్రం ఈ ప్రకటనను గిమ్మిక్కుగా పేర్కొన్నారు. చట్టాల రద్దుకు సంబంధించిన పార్లమెంటు ప్రక్రియ పూర్తయ్యేవరకూ తాము కదిలేది లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలూ విమర్శలను సంధించాయి. సాగుచట్టాల రద్దును ఇంతకాలం తాత్సారంచేసిన మోదీ సర్కారు... త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డాయి. దేశంలోని చిన్న, సన్నకారు రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించేందుకు సంపూర్ణ సదుద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చామని, అయినప్పటికీ కొందరు రైతులను ఒప్పించలేకపోయామని ఆయన పేర్కొన్నారు. ‘బహుశా మా తపస్సులో ఏదో లోపం ఉండి ఉండొచ్చు.. అందుకే దీపం లాంటి సత్యం గురించి కొందరు రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం.. ఈరోజు గురునానక్ దేవ్ పవిత్ర ప్రకాశ దినోత్సవం.. ఇది ఎవర్నీ తప్పుపట్టే సమయం కాదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం’ అని ప్రధాని వెల్లడించారు.
By November 20, 2021 at 08:10AM
No comments