Breaking News

ఉమ్మడి పౌర స్మృతిపై బీజేపీ కసరత్తు.. ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక తీర్మానం


సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలోని అయోధ్య రామ మందిర నిర్మాణం, కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం, ట్రిపుల్‌ తలాక్‌ వంటి కీలకమైన హామీలను చాలా వరకు నెరవేర్చినా.. ఉమ్మడి పౌర స్మృతి అంశం మాత్రం పెండింగ్‌లోనే ఉంది. ఈ హామీని కూడా నెరవేర్చేలా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారని, ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతి () పై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మద్ ప్రవక్త, పవిత్ర మత వ్యక్తులను కించపరిచేవారిని శిక్షించడానికి దైవదూషణ నిరోధక చట్టాన్ని అమలు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదివారం డిమాండ్ చేసింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉమ్మడి పౌర స్మృతి విధించే ప్రయత్నం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరింది. ‘సోషల్ మీడియాలో మతపరంగా విద్వేషాలను రెచ్చగొట్టేవారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. కాన్పూర్‌ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలకు దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ‘‘హిందువులు, సిక్కులు, ఇతర ముస్లిమేతర పండితులు సైతం మహమ్మద్ ప్రవక్త గొప్పతనాన్ని గుర్తించారు. అదే విధంగా ఇస్లాం బోధనలకు అనుగుణంగా ముస్లింలు కూడా ఇతర మతాలకు చెందిన గౌరవప్రదమైన వ్యక్తుల గురించి ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఆపాదించడానికి దూరంగా ఉన్నారు. అయితే, కొందరు దుర్మార్గులు ముహమ్మద్ ప్రవక్తను బహిరంగంగా అవమానించినప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిరోధక చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం’’ అని వ్యాఖ్యానించారు. మతతత్వ శక్తుల ఈ వైఖరి పూర్తిగా ఆమోదయోగ్యం కాదు అని మండిపడింది. పవిత్రమైన వ్యక్తులను అగౌరవపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని AIMPLB ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ‘ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సమర్థవంతమైన చట్టాన్ని రూపొందించాలి’ అని AIMPLB మత, సాంస్కృతిక స్వేచ్ఛ, వ్యక్తిగత చట్టాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఇలియాస్ అన్నారు. అయితే, ఈ తీర్మానంలో ముహమ్మద్ ప్రవక్త తప్ప మరే ఇతర మతాలకు చెందిన వ్యక్తి పేరు ప్రస్తావించలేదు. అలాగే, భారత్ వంటి బహుళ మతాలున్న దేశానికి ఉమ్మడి పౌర స్మృతి ఉపయోగకరంగా ఉండదు’ అని అభిప్రాయపడింది. గత కొన్నేళ్లుగా ముస్లింలకు వ్యతిరేకంగా విషపూరిత ప్రచారం జరుగుతోందని ఉద్ఘాటించింది.


By November 22, 2021 at 12:38PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/all-india-muslim-personal-law-board-opposes-uniform-civil-code/articleshow/87844188.cms

No comments