Breaking News

చైనా నేతపై లైంగిక ఆరోపణలు.. బీజింగ్‌లో ప్రత్యక్షమైన టెన్నిస్ స్టార్


కొద్ది రోజులుగా కనిపించకుండాపోయిన టెన్నిస్‌ స్టార్‌ పెంగ్‌ షువాయి ( ) ఆదివారం ప్రత్యక్షమైంది. బీజింగ్‌లో జరుగుతున్న యూత్‌ టోర్నీకి పెంగ్‌ ఆతిథిగా హాజరైనట్లు నిర్వాహకులు వీడియోతో పాటు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. చిన్నారులకు టెన్నిస్‌ బంతులపై సంతకాలు చేస్తూ, అభిమానులకు అభివాదం చేస్తున్నట్లు పెంగ్‌ ఆ వీడియోలో కనిపించింది. ఇది కూడా చైనా అధికారిక టోర్నీ కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన కీలక నేత జాంగ్ గోలీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కొద్ది గంటల తర్వాత నుంచే పెంగ్ షువాయి కనిపించకుండా పోయింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చైనా మాజీ వైస్ ప్రీమియర్(ఉన్నతాధికారి) జాంగ్ గోలీ తన తనను లైంగికంగా వేధించారని, ఆయనతో ఒకసారి బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొన్నట్టు ట్విట్ చేసింది. అయితే, ఈ ట్వీట్‌ ఆమె ఖాతా నుంచి కొద్ది గంటల్లో డిలీట్ అయ్యింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. దాంతో.. పెంగ్ షువాయికి ఏమైంది..? ఆమె ఎక్కడుంది..? అంటూ ఆమె క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తమయ్యింది. ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. ఆచూకీ తెలియజేయాలని కోరింది. అలాగే, జాంగ్ గోలీపై పెంగ్ చేసిన ఆరోపణలపై పూర్తి పారదర్శక దర్యాప్తు కోసం ఐరాస మానవ హక్కుల కార్యాలయం పిలుపునిచ్చింది. “ఆమె ఆచూకీ, క్షేమం గురించి రుజువు కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలపై పూర్తి పారదర్శకతతో విచారణ జరగాలని మేము కోరుతున్నాం” అని యూఎన్ హక్కుల చీఫ్ మిచెల్ బాచెలెట్ కార్యాలయ ప్రతినిధి లిజ్ థ్రోసెల్ అన్నారు. పెంగ్ (35) మాజీ వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ ఛాంపియన్. టెన్నిస్ స్టార్‌లు నొవాక్ జకోవిచ్, నవోమీ ఒసాకా.. పెంగ్ షువాయి ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేశారు. పెంగ్ షువాయి తమకి మెయిల్ చేసిందంటూ డబ్ల్యూటీసీ ఛైర్మన్ స్టీవ్ సిమిన్‌ చెప్పినట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. తాను క్షేమంగా ఉన్నానని, ఆ ఆరోపణలన్నీ అబద్దమని ఆ మెయిల్‌లో వెల్లడించినట్లు ఆ మీడియా సంస్థ తెలిపింది. దాంతో.. పెంగ్ షువాయి భద్రతపై మరిన్ని ప్రశ్నలు రేకెత్తాయి. ఇంత జరుగుతున్నా.. చైనా ప్రభుత్వం మాత్రం నోరువిప్పకపోవడంతో మరింత అనుమానాలు వ్యక్తమయ్యాయి. చైనా సీనియర్ రాజకీయ నేతపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. అటు, జాంగ్ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించ లేదు. 2013 నుంచి 2018 మధ్య చైనా వైస్ ప్రీమియర్‌గా జాంగ్(75) పని చేశారు. ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. టెన్నిస్ ఆడేందుకు ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత జాంగ్ తొలిసారిగా తనను బలవంతం చేశాడని పెంగ్ ఆరోపించింది.


By November 22, 2021 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-missing-tennis-player-peng-shuai-reappears-in-public-in-beijing/articleshow/87839459.cms

No comments