Breaking News

నానమ్మే నా సూపర్ మదర్..చనిపోయే ముందు అలా చెప్పారు: రాహుల్ భావోద్వేగ వీడియో


దివంగత మాజీ ప్రధాని, తన నాన్నమ్మ ఇందిరా గాంధీ 37వ వర్ధంతి సందర్భంగా తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నేత .. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ రాహుల్ కళ్లు చెమర్చారు. సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. తన చిన్ననాటి జ్ఞాపకాలను, ఆమె చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు రాహుల్ గాంధీ. అంత్యక్రియలు జరుగుతోన్న సమయంలో చితివైపు చూడలేక తన ముఖాన్ని దాచుకుంటున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియోను షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ అందుకు గల కారణాలను వివరించారు. ఇందిర మరణాన్ని తన జీవితంలో రెండో అత్యంత బాధాకరమైన రోజుగా పేర్కొన్న రాహుల్‌ గాంధీ.. నానమ్మే తనకు ‘సూపర్‌ మదర్’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నా ప్రియమైన నానమ్మ ఇందిరాజీ జ్ఞాపకార్థం ప్రేమతో’ అనే టైటిల్‌తో రాహుల్ యూట్యూబ్‌లో వీడియోను పోస్ట్ చేశారు. ‘నానమ్మ అంత్యక్రియలు జరిగే సమయంలో నా తలను దాచుకోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది.. ‘నాకేదైనా జరిగితే ఏడవద్దు’ అని ఆ రోజు ఉదయమే ఆమె నాతో చెప్పింది.. అలా చెప్పిన మూడు, నాలుగు గంటల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది.. తనను చంపేస్తారనే విషయం నానమ్మ ముందుగానే ఊహించి ఉంటారు. దీనిని ఇంట్లోని వారందరూ దాన్ని ముందుగానే గ్రహించారని అనుకుంటున్నాను.. అప్పుడు నానమ్మ చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన రెండో సంఘటన’ అని ఇందిరా గాంధీ అంత్యక్రియల నాటి వీడియోను చూపిస్తూ రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఏదైనా వ్యాధితో చనిపోవడం అతిపెద్ద శాపం అంటూ ఒకసారి డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేసే సమయంలో నాతోపాటు మా అందరికీ నానమ్మ చెప్పింది. ఆమె నమ్మిన సిద్ధాంతాలు, దేశం కోసం ఇలా చనిపోవడమే అత్యంత ఉత్తమ మార్గం అని భావించి ఉంటారు.. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ, ఇప్పుడు అర్థమయ్యింది’ అని ఇందిరాగాంధీ తనతో చెప్పిన మాటలను రాహుల్‌ గాంధీ గుర్తు చేసుకున్నారు. ‘మా కుటుంబంలో నాన్న చాలా కఠినంగా ఉండేవారు. నాపై అమ్మానాన్నలు ఎప్పుడైనా కోప్పడ్డా నానమ్మే నాకు మద్దతుగా నిలబడేది. ‘సూపర్‌’ మదర్‌ నానమ్మతో కలిపి నాకు నిజంగా ఇద్దరు తల్లులు.. ఆమె మరణం నా తల్లిని కోల్పోవడం వంటిదే’ అని కుటుంబ సభ్యుల ఫోటోలతో నిండివున్న గదిని చూపిస్తూ రాహుల్‌ గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ‘చివరి క్షణం వరకు మా నానమ్మ దేశం కోసం భయం లేకుండా సేవ చేశారు.. ఆమె జీవితం నాకు ప్రేరణ ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఇక, 1966 నుంచి 1977 మధ్య కాలంలో భారత ప్రధానిగా కొనసాగిన ఇందిరా గాంధీ.. శక్తివంతమైన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, 1977లో ఎమర్జెన్సీ విధించి తీవ్ర అపవాదును కూడా మూటగట్టుకున్నారు. కానీ, అనంతరం 1980లో మరోసారి ప్రధానిగా బాధత్యలు చేపట్టిన ఇందిరా గాంధీ.. చనిపోయేవరకు ఆ పదవిలో కొనసాగారు. 1984 అక్టోబర్‌ 31న సొంత భద్రతా సిబ్బంది చేతిలోనే ఇందిరా గాంధీ హత్యకు గురైన విషయం తెలిసిందే.


By November 01, 2021 at 07:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-rahul-gandhi-described-indira-gandhi-death-second-most-difficult-day-of-his-life-/articleshow/87448643.cms

No comments