Breaking News

Bhopal ఆస్పత్రిలో ఘోర ప్రమాదం.. నలుగురు శిశువులు సజీవదహనం


మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పీడియాట్రిక్స్ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 25 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మంటలు చెలరేగిన తర్వాత తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు పెట్టారు. వార్డులో పొగలు వ్యాపించడంతో చిన్నారులతో పాటు పెద్దలు, ఆస్పత్రి సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు. లోపల ఉన్న చిన్నారుల పరిస్థితి గురించి తెలియక వారి తల్లిదండ్రులు అర్ధరాత్రి వరకూ బయట పడిగాపులు కాశారు. అస్వస్థతకు గురైన చిన్నారులను హుటాహుటిన మరో వార్డుకు తరలించినట్టు అధికారులు తెలిపారు.


By November 09, 2021 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-children-die-as-fire-breaks-out-in-bhopal-kamala-nehru-hospital/articleshow/87596343.cms

No comments