Breaking News

భారత్ భూభాగంలో చైనా మరో నిర్మాణం.. 60 ఇళ్లతో రెండో గ్రామం..!


భారత సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో చైనా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో మరో నిర్మాణాన్ని పూర్తిచేసినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 60 భవనాలతో రెండో క్లస్టర్‌ నిర్మాణం పూర్తిచేసినట్టు ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం వెల్లడైందని ఎన్డీటీవీ ఓ కథనంలో పేర్కొంది. 2019లో శాటిలైట్ చిత్రాల్లో లేని భవనాలు.. తాజా చిత్రాల్లో కనిపించినట్లు తెలిపింది. 2019 మార్చి- 2021 ఫిబ్రవరి మధ్య అరుణాచల్‌లోని షీ యోమి జిల్లాలో ఈ భవనాల నిర్మాణాలను పూర్తి చేసినట్లు వెల్లడించింది. అయితే, కొత్త నిర్మాణాలు చేపట్టిన ప్రాంతం చైనా భూభాగంలోదేనని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ సరిహద్దుల్లో చైనా 100 ఇళ్లతో కొత్తగా ఓ గ్రామాన్నే సృష్టించినట్టు ఇటీవలే అమెరికా రక్షణ శాఖ వార్షిక నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నివేదిక వెల్లడయిన కొద్ది రోజులకే తాజాగా మరోచోట నిర్మాణాలు పూర్తిచేసినట్టు ఎన్‌డీటీవీ కథనం పేర్కొవడం గమనార్హం. అయితే, పెంటగాన్ నివేదికపై స్పందించిన భారత సైన్యం ఆ నిర్మాణం ఇప్పటికిప్పుడు పూర్తిచేసింది కాదని స్పష్టం చేసింది. ఆరు దశాబ్దాల కిందటే భారత్-చైనా యుద్ధ సమయంలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుందని, 1960 నుంచే ఈ గ్రామం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, రెండో క్లస్టర్ వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుకు మధ్య భారత్ భూభాగంలోని 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ ప్రాంతం ఆక్రమించుకున్నదా? అనేది స్పష్టత లేదు. ఈ అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్మీని సంప్రదించగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘ఈ నిర్మాణం ఉందని చెబుతున్న ప్రదేశం LACకి ఉత్తరాన ఉంది.. మాకున్న అవగాహన ప్రకారం అక్కడ అలాంటి నిర్మాణం ఏదీ లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ప్రపంచంలోనే అత్యుత్తమ శాటిలైట్ వ్యవస్థ కలిగిన మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ల్యాబ్‌ల చిత్రాలు మాత్రం ఏడాదిన్నర కిందట అక్కడ ఎటువంటి నిర్మాణం లేదని చెబుతున్నాయి. అరుణాచల్‌లోని షి-యోమి జిల్లాలో కేవలం డజన్ల కొద్దీ భవనాలను మాత్రమే కాకుండా రూఫ్ టాప్‌పై చైనా జెండాతో కూడిన నిర్మాణం ఇమేజింగ్ ఉపగ్రహాల ద్వారా గుర్తించగలిగేంత పెద్దవిగా ఉన్నాయి. ఈ పెద్ద జెండా ఆ ప్రాంతానికి ప్రాదేశిక హక్కును నొక్కిచెప్పినట్లు కనిపిస్తోంది. భారత మ్యాప్‌లో కొత్త నిర్మాణం ఖచ్చితమైన స్థానం స్పష్టంగా సూచించిస్తోంది. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని భారత డిజిటల్ మ్యాప్ కూడా భారతదేశంలోని స్థానాన్ని నిర్ధారిస్తుంది. ‘భారత అధికారిక సర్వే వెబ్‌సైట్ నుంచి లభించిన GIS (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) డేటా ఆధారంగా ఈ గ్రామం వాస్తవానికి భారత ప్రాదేశిక ప్రాంతం పరిధిలోకి వస్తుంది’ అని ఐరోపాకు చెందిన ఫోర్స్ అనాలిసిస్‌ చీఫ్ మిలిటరీ అనలిస్ట్ సిమ్ టాక్ చెప్పారు. ‘ఇది స్థానికంగా భారత్ వైపు నుంచి కంటే చైనీస్ వైపు చాలా అనుకూలంగా ఉండే ప్రదేశంగా కనిపిస్తుంది.. ఈ లోయ యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నది సమీపంలోని చైనీస్ కమ్యూనిటీలను నేరుగా కలుపుతుంది.. అయితే ఇది భారత నియంత్రణ భూభాగం నుంచి ఏటవాలుగా ఉన్న పర్వత శ్రేణులతో వేరు చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు.


By November 19, 2021 at 06:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/china-second-constructed-enclave-in-arunachal-pradesh-says-new-satellite-images/articleshow/87790828.cms

No comments