40 ఏళ్ల తర్వాత నవంబరులో తుంగభద్రకు వరద.. కర్నూలుకు పొంచి ఉన్న ముప్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్టి, వరద నీటితో నదులు పోటెత్తగా.. చెరువులు కట్టలు తెగి ముంచెత్తుతున్నాయి. అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట గంగపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నాడు. మొత్తం ఐదు జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపాడు. తుమకూరు, రామనగర, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాలతో తుంగభద్ర రిజర్వాయర్‌కు నవంబరులో వరద పోటెత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం నవంబరులో తుంగభద్ర గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. 1982-83 నవంబరులో ఇంత పెద్దఎత్తున వరద చేరింది. నాటి వరద 39 ఏళ్ల తర్వాత పునరావృతమయ్యింది. సాధారణంగా తుంగభద్ర జలాశయానికి జులై నుంచి సెప్టెంబర్ వరకు ప్రవాహ ఉద్ధృతి ఉంటుంది. కానీ, ప్రస్తుతం రెండో పంట సమయంలోనూ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 100.316 టీఎంసీలకు చేరింది. ఎగువన శివమొగ్గ, ఆగుంబె, తీర్థహళ్లి, సాగర, హొసనగర, కడూరులో కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం రాత్రి 1.10 లక్షల క్యూసెక్కుల వరద చేరింది. ఆదివారం సాయంత్రానికి ప్రవాహం 83,664 క్యూసెక్కులకు తగ్గడంతో 28 గేట్లను అడుగు మేర ఎత్తి.. 76,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు వరద పోటెత్తడంతో యునెస్కో గుర్తింపు పొందిన హింపీలో పలు చారిత్రక కట్టాలు మునిగిపోయాయి. పురందర మండపం, విజయనగర కాలం నాటి వంతెన, చక్రతీర్థ, రామలక్ష్మణ ఆలయాలను వరద నీరు చుట్టుముట్టింది. కర్ణాటక నుంచి దిగువకు నీరు వదలడంతో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుజిల్లాలో తుంగభద్ర నదికి ఆదివారం వరద పోటెత్తింది. కౌతాళం మండలం మేళిగనూరు వద్ద సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లక్ష క్యూసెక్కులకుపైగా వరద నీరు సుంకేసుల జలాశయానికి వస్తోంది. ఈ నేపథ్యంలో 19 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కోసిగి, కౌతాళం, మంత్రాలయం మండలాల్లోని నదీతీర గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
By November 22, 2021 at 07:19AM
No comments