Breaking News

కాంగ్రెస్‌కు భారీ షాక్.. రాత్రికి రాత్రే పార్టీ మారిన మాజీ సీఎం సహా 12 మంది ఎమ్మెల్యేలు


మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది రాత్రికి రాత్రే తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. బుధవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా సహా 12 మంది టీఎంసీలో చేరినట్టు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. తృణమూల్‌లో చేరికపై అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మొత్తం 60 సీట్లు ఉన్న మేఘాలయ అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా 12 మంది ఎమ్మెల్యేల చేరికతో రాత్రికే రాత్రే తృణమూల్‌ ప్రధాన ప్రతిపక్షపార్టీగా అవతరించింది. దీంతో 2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో బలమైన పోటీఇచ్చే అవకాశం ఉంది. వరుసుగా మూడోసారి బెంగాల్‌లో విజయం సాధించి అధికారం చేపట్టిన మమతా బెనర్జీ.. ఈశాన్య రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవడంపై దృష్టి సారించారు. తాజా వార్త మమతా బెనర్జీకి ఊత్సాహాన్ని ఇవ్వనుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీపై మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన వర్గంతో కలిసి తృణమూల్‌లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఢిల్లీ పర్యటనలో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని మోదీతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారా?’ అన్న మీడియా ప్రశ్నకు ఆమె లేదని.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆమె తీరకలేకుండా ఉన్నారని బదులిచ్చారు. అంతేకాదు, ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ మేము సోనియా గాంధీని కలవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించిన టీఎంసీ.. వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. రెండు రోజుల కిందట కాంగ్రెస్‌ నేతలు కీర్తి ఆజాద్‌, రాహుల్‌ గాంధీకి ఒకప్పుడు సన్నిహితుడు అశోక్‌ తన్వర్‌, జేడీయూ మాజీ ఎంపీ పవన్ వర్మ మమతా బెనర్జీ సమక్షంలో ఆపార్టీలో చేరారు. గత సెప్టెంబర్‌లో గోవా మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్ నేత లుజినో ఫలైరో తృణమూల్‌లో చేరారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఏడాది గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ బలాన్ని పెంచుకునేందుకు మమత బెనర్జీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గోవాలో గెలుపే లక్ష్యంగా మమతా పావులు కదుపుతున్నారు.


By November 25, 2021 at 07:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/12-of-17-congress-mlas-including-ex-cm-mukul-sangma-join-trinamool-in-meghalaya-in-late-night-coup/articleshow/87900431.cms

No comments