Breaking News

Work from Space అంతరిక్షంలో బిజినెస్ పార్క్.. అమెజాన్ శ్రీమంతుడు మరో కీలక నిర్ణయం!


ఈ ఏడాది జులైలో అంతరిక్ష పర్యాటకానికి శ్రీకారం చుట్టిన అమెజాన్‌, బ్లూ ఆరిజిన్‌ సంస్థల అధినేత జెఫ్‌ బెజోస్‌.. ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్బిటాల్ రీఫ్ పేరుతో వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నారు. సియార్రా స్పేస్‌, బోయింగ్, రెడ్‌వైర్‌ స్పేస్‌, జెనిసిస్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో దీనిని చేపట్టనున్నట్టు వెల్లడించారు. 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ అంతరిక్ష కేంద్రాన్ని బిజినెస్‌ పార్క్‌గా తీర్చిదిద్దనున్నట్లు సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ బిజినెస్‌ పార్క్‌లో ఏకకాలంలో పది మందికి ఆస్ట్రోనాట్స్‌కు ఉండేలా స్పేస్‌ హోటల్‌, సినిమా చిత్రీకరణ స్టూడియో, పరిశోధనల కోసం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుండటం గమనార్హం. 2025 తర్వాత ఆర్బిటాల్‌ రీఫ్‌కు తొలి అంతరిక్షయానం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తాన్ని చెప్పడానికి ఆయా సంస్థల ప్రతినిధులు నిరాకరించారు. అయితే, ప్రైవేటు స్పేస్‌ ఏజెన్సీలు, హైటెక్‌ సంస్థలు, స్పేస్‌ ప్రాజెక్టులు లేని దేశాలు, మీడియా, ట్రావెల్‌ సంస్థలు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు. అయితే, ఆర్బిటాల్ రీఫ్‌ నిర్మాణం ఎప్పటిలోగా పూర్తిచేయాలనేది నిర్దేశించుకోలేదు. కానీ, నాసాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రత్యామ్నాయంగా తక్కువ కక్ష్య‌లో దీనిని ఏర్పాటుచేయనున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు బెజోస్‌.. బ్లూ ఆరిజిన్‌ ప్రయోగాల కోసం ఏటా 1 బిలియన్‌ డాలర్లు కేటాయిస్తున్నట్లు అంతర్జాతీయ పత్రికల కథనాల ద్వారా తెలుస్తోంది. నాసా ఐఎస్ఎస్‌‌కి 20 ఏళ్లు పూర్తికావడం, దానికి నిధులు 2030లో ముగియనుండగా.. తదుపరి దశ కాంగ్రెస్ నుంచి పొందే నిధులపై ఆధారపడి ఉంటాయి. అయితే, కొత్త అంతరిక్ష కేంద్రం అవసరాన్ని కూడా గ్రహించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్నదానిని భర్తీ చేయడానికి లేదా పూర్తి చేయడానికి కొత్తగా నిర్మించాలి. ‘అరవై సంవత్సరాలుగా NASA,ఇతర అంతరిక్ష సంస్థలు అంతరిక్ష నౌకలు, నివాసాలను అభివృద్ధి చేశాయి.. ఈ దశాబ్దంలో వాణిజ్య వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మేము ఏర్పాట్లు చేశాం’ అని బ్లూ ఆరిజిన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్రెంట్ షేర్‌వుడ్ అన్నారు. ‘మేము పరిధిని విస్తరించి ఖర్చులను తగ్గిస్తాం.. అంతరిక్ష వాహనాలను సాధారణీకరించడానికి అవసరమైన అన్ని సేవలు, సౌకర్యాలను అందిస్తాం... ఒక శక్తివంతమైన వ్యాపార పర్యావరణ వ్యవస్థ తక్కువ భూమి కక్ష్యలో పెరుగుతుంది.. కొత్త ఆవిష్కరణలు, కొత్త ఉత్పత్తులు, కొత్త వినోదాలు, ప్రపంచ అవగాహనను పెంపొందిస్తుంది’ అని ఆయన వివరించారు.


By October 30, 2021 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/blue-origin-founder-jeff-bezos-wants-to-build-a-business-park-in-space/articleshow/87384394.cms

No comments