Breaking News

Sabarimala Darshan అయప్ప భక్తులకు శుభవార్త.. రోజుకు 25వేల మందికి అనుమతి.. కేరళ సీఎం కీలక ప్రకటన


కరోనా వైరస్ నేపథ్యంలో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులను పరిమితంగానే అనుమతిస్తున్నారు. మండల-మకరువిళక్కు పూజలకు గతేడాది తొలుత 1,000 మంది భక్తులను అనుమతించగా... క్రమంగా దానిని 5,000కు పెంచారు. అయితే, ఈ ఏడాది మండల-మకరవిళక్కు సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శనానికి ప్రారంభంలో రోజుకు 25 వేల మందిని అనుమతిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబరు 16 నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భక్తుల సంఖ్యను సవరించాల్సి వస్తే, చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మండల-మకరవిళక్కు పూజలు సమయంలో శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో గురువారం ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో దేవాదాయ, రవాణా, అటవీ, ఆరోగ్య, జల వనరుల శాఖల మంత్రులు, డీజీపీ పాల్గొన్నారు. శబరిమల యాత్రకు రోజుకు 25,000 మంది వరకు భక్తులను అనుమతిస్తామని సీఎం విజయన్ చెప్పారు. వర్చువల్ క్యూ సిస్టమ్ కొనసాగుతుందని వివరించారు. పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడినవారిని కూడా శబరిమలలోకి అనుమతిస్తామని, అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలని లేదా, ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తీసుకురావాలని చెప్పారు. అందరికీ నెయ్యాభిషేకానికి దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్వామి దర్శనం అనంతరం భక్తులను సన్నిధానం వద్ద ఉండటానికి అనుమతించరాదని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. ఎరుమేలి, పులిమేడు గుండా సన్నిధానానికి సంప్రదాయ అటవీ మార్గంలో భక్తులను అనుమతించబోమని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. భక్తుల వాహనాలను నీలక్కల్ వరకు మాత్రమే అనుమతిస్తామని, అక్కడి నుంచి పంపా నదికి కేఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నారు. పంబలో స్నానానికి కూడా అనుమతించినట్టు తెలిపారు. బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ఇతర చోట్ల తగినన్ని మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని కేఎస్ఆర్టీసీని ఆదేశించినట్లు చెప్పారు. మండల-మకరవిళక్కు సమయంలో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏటా నవంబరు 16 నుంచి జనవరి 20 వరకు ఆలయం రెండు నెలల మాత్రమే పూర్తిస్థాయిలో తెరిచి ఉంటుంది.


By October 08, 2021 at 06:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/daily-25000-devotees-to-be-allowed-in-sabarimala-only-fully-jabbed-can-enter/articleshow/86856441.cms

No comments