Breaking News

POK ఏదో ఒకరోజు పీఓకేను భారత్‌లో కలిపేయడం పక్కా.. ఎయిర్‌ మార్షల్ కీలక వ్యాఖ్యలు


పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమని, అయితే దానిని ఇప్పటికిప్పుడు స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికేదీ ప్రస్తుతానికి లేదని ఎయిర్‌ఫోర్స్ వెస్ట్రన్ కమాండర్ ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, ఎయిర్‌ మార్షల్‌ అమిత్‌ దేవ్‌ స్పష్టం చేశారు. అయితే, యావత్‌ కశ్మీర్‌ ఏదో ఒకనాడు భారత్‌ సొంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సైన్యం బుద్గాంలో అడుగుపెట్టి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం శ్రీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బుద్గామ్‌లో కాలుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయిన చారిత్రాత్మక సందర్భంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, మన దళాలను త్వరగా తరలించాం... శ్రీనగర్ ఎయిర్‌ఫీల్డ్ రక్షించి, ఆ తర్వాత కబళించేందుకు వచ్చిన సైన్యంపై దాడి చేసి తరిమికొట్టాం’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని ఉండకపోతే పక్కగా కశ్మీర్‌ మొత్తం భారత్‌కే చెంది ఉండేదని అన్నారు. డ్రోన్లతో కలిగించగలగే నష్టం తక్కువేననీ, దానిని ఎదుర్కొనే పరికరాలూ మనవద్ద ఉన్నాయని ఎయిర్ మార్షల్ చెప్పారు. కాగా, 1947 అక్టోబరు 27న సైన్యం, వాయుసేన బద్గాంకు స్వేచ్ఛ కల్పించిన తీరును శ్రీనగర్‌ శివార్లలోని రంగ్‌రీత్‌ వైమానిక స్థావరం వద్ద పునఃసృష్టించారు. దేశ విభజన తర్వాత పాక్‌ సేనల నుంచి కశ్మీర్‌ను రక్షించడానికి సైన్యం ఎలాంటి ప్రయత్నం చేసిందో దీని ద్వారా వివరించారు. ఆనాడు పాక్‌ అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంలో అమరులైన సైనిక వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వాతంత్రం అనంతరం స్వదేశీ సంస్థానాలను భారత్‌ యూనియన్‌లో విలీనంలో భాగంగా.. అప్పటి కశ్మీర్‌ పాలకుడు మహారాజా హరిసింగ్, భారత ప్రభుత్వం మధ్య 1947 అక్టోబరు 26న ఒప్పందం కుదిరింది. దీంతో కశ్మీర్‌లోకి భారత్ సైన్యం మర్నాడు అంటే అక్టోబరు 27న బద్గామ్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో 75 సంవత్సరాల వేడుకల్లో కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘లెఫ్టినెంట్ కల్నల్ దివాన్ రంజిత్ రాయ్ నేతృత్వంలోని దళాలు పాక్ దళాలను తరిమికొట్టాయి.. ఈ క్రమంలో బారాముల్లాలో ఆయన తన ప్రాణాలను అర్పించారు.. జమ్మూ కశ్మీర్‌లోని ప్రజలు, సైనికులు, భారత సైన్యం పాక్ దళాలను తరిమికొట్టడానికి ధైర్యంగా పోరాటం చేశారు.. 05 జనవరి 1949న కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే వరకూ యుద్ధం కొనసాగింది’ అని ఆర్మీ ఓ ప్రకటన చేసింది.


By October 28, 2021 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/one-day-pak-occupied-kashmir-will-merge-in-india-says-top-iaf-commander-on-infantry-day/articleshow/87326543.cms

No comments