Breaking News

Modi Italy Tour ఇటలీలో మోదీ.. నేడు పోప్‌తో కీలక భేటీ.. అందరి దృష్టి దానిపైనే!


జీ20 దేశాల కూటమి 16వ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు రెండు రోజుల ఇటలీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులతో భేటీ కానున్నారు. దౌత్య సమావేశాలతో పాటు పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని భేటీ కావడం అందరి దృష్టి దానిపైనే ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం వాటికన్ ప్రైవేట్ లైబ్రరీలో పోప్‌తో ప్రధాని భేటీ అవుతారు. ‘కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్’గా పిలిచే వాటికన్‌లో పోప్ ముఖ్య సలహాదారుని కూడా ప్రధాని మోడీ కలవనున్నారు. ప్రధాని ఇటలీ పర్యటన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్దన్ ష్రింగ్లా వెల్లడించారు. ‘ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది.. ఆయన, పోప్ ముఖాముఖి భేటీ అవుతారు.. కొంత సమయం తరువాత ప్రతినిధి స్థాయి చర్చలు జరుగుతాయి’ అన్నారు. అయితే, పోప్‌తో చర్చలకు ఎటువంటి ఎజెండా లేదని ఆయన తెలిపారు. ‘సంప్రదాయంగా పవిత్రమైన వ్యక్తులతో సమస్యలను చర్చించేటప్పుడు ఎజెండా ఉండదని నేను నమ్ముతున్నాను. మేము దానిని గౌరవిస్తాం.. చర్చల సందర్భంగా సాధారణ ప్రపంచ దృక్పథాలు, మనందరికీ ముఖ్యమైన సమస్యలే ఉంటాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. కోవిడ్-19, ఆరోగ్య సమస్యలపై ఎలా కలిసి పనిచేయాలి వంటి సాధారణ అంశాలే చర్చకు వస్తాయని భావిస్తున్నాను’ అని ష్రింగ్లా పేర్కొన్నారు. శుక్రవారం ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ.. రోమ్‌లో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్‌తోపాటు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి, పర్యావరణం, వాతావరణ మార్పులపై ఈ సమావేశంలో చర్చించారు. రోమ్ చేరుకున్న ప్రధాని మోడీకి స్థానికుల నుంచి భారీ స్పందన లభించింది. రోడ్లపైకి వచ్చిన స్థానిక భారతీయులు మోడీ.. మోడీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోదీ కావడం విశేషం. ఇటలీ నుంచి ప్రధాని మోదీ యూకే బయల్దేరుతారు. బ్రిటన్ ప్రధాని బోరిన్ జాన్సన్ ఆహ్వానం మేరకు నవంబర్ 1న గ్లాస్గోలో జరిగే కాప్ 26వ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బోరిస్‌తోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. పర్యటన ముగించుకుని నవంబర్ 3న ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు.


By October 30, 2021 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-to-hold-meeting-with-pope-francis-in-vatican-city-ahead-of-g-20-summit/articleshow/87387928.cms

No comments