Breaking News

Kashmir ఉగ్రవాదుల మారణహోమం వెనుక పాక్ సైన్యం హస్తం


జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లాలోని అడవుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కనీసం ఎనిమిది రోజుల పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు సహా 9 మంది సైనికులు అమరులయ్యారు. అయితే, చొరబాటుదారులకు పాక్ కమాండోలు శిక్షణ ఇచ్చినట్టు సైన్యం, పోలీసు వర్గాలు తెలిపాయి. గత సోమవారం నుంచి రాజౌరీ సెక్టార్‌లోని నార్ ఖాస్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగగా.. ఇటీవల కాలంలో జమ్మూ కశ్మీర్‌లో సైన్యానికి అతిపెద్ద నష్టం ఇదే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారా? అనేది స్పష్టతలేదు. ఘటనా స్థలిలో వారి మృతదేహాలు ఇంకా కనుక్కోలేదు. భారీ కూంబింగ్ ఆపరేషన్, సోదాలు, తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగిప్పటికీ 8-9 కి.మీ దట్టమైన అడవిలో పోరాటం కొనసాగుతోంది. నియంత్రణ రేఖ వద్ద డేరా వలీ గలీ ప్రాంతంలో అక్టోబరు 10 రాత్రి నుంచి ఎదురుకాల్పులు ప్రారంభం కాగా.. జేసీఓ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం గురువారం నార్ ఖాస్ అడవిలో ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ముష్కరులు కాల్పలకు తెగబడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతయ్యింది. 48 గంటల ఆపరేషన్ తర్వాత ఆ ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఎనిమిది రోజుల పాటు వేలాది మంది భద్రతా దళాలను ఈ తీవ్రవాదుల బృందం తప్పించుకుని, ఇంత భారీ ప్రాణనష్టాన్ని కలిగించిందంటే పాక్ ఆర్మీ కమాండోల హస్తం తప్పకుండా ఉండే ఉంటుందని ఆర్మీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ‘ఉగ్రవాదులతో పాటు పాక్ కమాండోలు కూడా ఉండొచ్చు.. కానీ, అయితే వారిని కాల్చి చంపిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది’ అని ఓ అధికారి అన్నారు. ఉగ్రవాద ఆపరేషన్‌లో ముందుకు వెళుతున్నప్పుడు భద్రతా వర్గాలు జాగ్రత్తగా ఉండాలని, ఇకపై ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం, ఒక ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భావించినప్పుడు.. ఎన్‌కౌంటర్‌లో పారా కమాండోలు, హెలికాప్టర్ల సహాయం తీసుకుంటారు.


By October 18, 2021 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-commandos-hand-suspected-in-deadly-jammu-and-kashmir-encounter-say-sources/articleshow/87099530.cms

No comments