Breaking News

Kashmir ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. సోఫియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు జోన్ పోలీసులు వెల్లడించారు. వీరిలో ఒకరిని గండేర్‌బల్‌కు చెందిన ముఖ్తార్ షా అనే తీవ్రవాదిగా గుర్తించారు. శ్రీనగర్‌లో గతవారం బిహార్‌కు చెందిన వీధి వ్యాపారి వీరేంద్ర పాశ్వాన్‌ను ఈ ఉగ్రవాదే హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించాల్సి ఉందని వివరించారు. ఘటనా స్థలిలో సైన్యం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. సోఫియాన్‌ జిల్లా ఇమామ్‌సాహెబ్ ప్రాంతంలోని తుల్రాన్ వద్ద ఉగ్రవాదులున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సోమవారం సాయంత్రం అక్కడకు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదుల కోసం గాలించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కాగా, సోమవారం జమ్మూ కశ్మీర్‌‌లో మూడు చోట్ల భద్రత దళాలకు, ఉగ్రమూకలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. రాజౌరీ సెక్టార్ వద్ద జరిగిన కాల్పుల్లో ఐదుగురు భద్రత దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన చోట్ల ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సాయుధులైన ముష్కరులు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి దాక్కున్నారన్న సమాచారంతో భద్రత దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. పూంఛ్‌ జిల్లా సురన్‌కోట్‌ సమీపంలోని ఓ గ్రామ పరిసరాల్లో సుమారు ఐదుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా సంస్థల సమాచారం మేరకు సోమవారం ఉదయం భద్రత దళాలు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు పెద్దఎత్తున కాల్పులకు తెగబడడంతో ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీవో)తో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


By October 12, 2021 at 09:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-lashkar-terrorists-killed-in-encounter-in-shopian-of-jammu-and-kashmir/articleshow/86956812.cms

No comments