Kashmir వ్యూహం మార్చిన ఉగ్రవాదులు.. శ్రీనగర్‌లో మెరుపు దాడులు.. ముగ్గురు మృతి
కశ్మీర్‌లో ముష్కర మూకల దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకూ భద్రత బలగాలనే లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదులు.. పంథాను మార్చారు. సాధారణ పౌరులపై దాడిచేసి ప్రాణాలు తీస్తున్నారు. వారం వ్యవధిలో ఐదుగురు పౌరులు ఉగ్రవాదుల చేతుల్లో బలయ్యారు. మంగళవారం రాత్రి శ్రీనగర్‌లో వేర్వేరు చోట్ల తీవ్రవాదుల దాడిచేసి ముగ్గుర్ని హత్యచేశారు. వీరిలో ఓ కెమిస్ట్, వీధి వ్యాపారి, క్యాబ్ డ్రైవర్ ఉన్నారు. గంట వ్యవధిలోనే ఈ ముగ్గుర్నీ ముష్కరులు తుపాకితో కాల్చి చంపారు. శ్రీనగర్ ఇక్బాల్ పార్కు వద్ద ఉన్న బింద్రూ మెడికేట్ ఫార్మసీ యజమాని, కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రూ (70)పై రాత్రి 7 గంటల ప్రాంతంలో పాయింట్ బ్లాక్‌లో తుపాకితో కాల్చి చంపారు. అతడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం అక్కడకు చేరుకునేసరికి ముష్కరులు పరారయ్యారు. 90వ దశకంలో ఉగ్రవాదుల ఊచకోతకు భయపడి కశ్మీరీ పండిట్లు వేరే ప్రాంతాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. బింద్రూ మాత్రం అక్కడే ఉండి ఫార్మసీ నడుపుతున్నారు. ఇది జరిగిన తర్వాత లాల్ బజార్‌లోని వీరేంద్ర పాశ్వాన్ అనే వీధి వ్యాపారిని హత్యచేశారు. బిహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన వీరేంద్ర శ్రీనగర్‌లోని జదిబాల్ ప్రాంతంలో ఉంటున్నారు. ఈ రెండు ఘటనల జరిగిన గంటలోనే బందిపొరాలో మహ్మద్ షఫీ అనే ట్యాక్సీ డ్రైవర్‌పై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. ఈ ఘటనలతో అప్రమత్తమైన సైన్యం, పోలీసులు మూడు చోట్లా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ముష్కరులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భద్రత బలగాలతో సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపిస్తూ శనివారం మాజీద్ అహ్మద్ గోజ్రా, మహ్మద్ షఫీ దార్ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు హత్యచేశారు. తాజా ఘటనపై జమ్మూ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘బింద్రూ హత్య తనను తీవ్రంగా కలిచివేసింది.. ఆయన చాలా మంచి మనిషి.. ఉగ్రవాదం తీవ్రమైన దశలో ఉన్నప్పుడు కూడా కశ్మీర్ విడిచి వెళ్లకుండా ఫార్మసీ నడుపుకుంటూ ఇక్కడే ఉండిపోయారు.. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
By October 06, 2021 at 07:05AM
No comments