వెంకయ్య అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం.. దీటుగా బదులిచ్చిన భారత్
భారత్, చైనాల బుధవారం మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత నేతలు అరుణాచల్‌లో పర్యటించడాన్ని తాము ఖచ్చితంగా, గట్టిగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది. అరుణాచల్‌ను తాము భారత్‌లో భాగంగా గుర్తించడం లేదని, అది దక్షిణ టిబెట్‌లో ఒక భాగమని పేర్కొంది. ఉప-రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్టోబరు 9న అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సమావేశమైన ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. అటు చైనా వ్యాఖ్యలపై భారత్ కూడా దీటుగానే స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తేల్చిచెప్పారు. భారత్ నేతలు అక్కడ పర్యటిస్తే చైనా అభ్యంతరం చెప్పడం అర్థంలేని చర్యలని కొట్టిపారేశారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్టే అరుణాచల్‌లోనూ పర్యటిస్తారని, ఇందులో మార్పేమీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దుల్లో నెలకున్న ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావించిన బాగ్చీ.. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ పరిస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ‘అందువల్ల, సంబంధం లేని సమస్యలతో ముడిపెట్టడానికి ప్రయత్నించడం కంటే ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌కు పూర్తిగా కట్టుబడి ఉంటూ తూర్పు లడఖ్‌లో ఎల్ఏసీ వెంట మిగిలిన సమస్యలను ముందుగానే పరిష్కరించే దిశగా చైనా పని చేయాలని మేం ఆశిస్తున్నాం’అని ఘాటుగా బదులిచ్చారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌ను ఏకపక్షంగా, బలవంతంగా, చట్టవిరుద్దంగా భారత్‌లో కలిపేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఆ రాష్ట్రాన్ని తాము గుర్తించడం లేదని, అక్కడ భారత నేతలు పర్యటిస్తే వ్యతిరేకిస్తామని వెల్లడించారు. చైనా, భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినేలా, సరిహద్దు వివాదాలు పెరిగిపోయేలా వ్యవహరించవద్దని వ్యాఖ్యానించారు. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఏడాదిన్నరగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఆదివారం జరిగిన భారత్, చైనాల మధ్య 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇరు దేశాలూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నాయి.
By October 14, 2021 at 07:09AM
No comments