Breaking News

పాము కాటుతో హత్యలు ఇదో కొత్త ట్రెండ్.. నిందితుడికి బెయిల్ కుదరదు: సీజేఐ రమణ తీవ్ర వ్యాఖ్యలు


పాముతో కరిపించి మహిళను హత్య చేసిన నిందితుడికి బెయిల్ నిరాకరించింది. రాజస్థాన్‌కు చెందిన నిందితుడు బెయిల్ పిటిషన్‌కు దాఖలు చేయగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. ‘పాములను పట్టేవారి నుంచి విషపూరిత సర్పాలను తెప్పించి కాటువేయించి, హత్య చేయడం కొత్త ధోరణి ఇది.. రాజస్థాన్‌లో ప్రస్తుతం ఇది సర్వసాధారణమయ్యింది’అని అన్నారు. నిందితుడు కృష్ణ కుమార్ తరఫున వాదనలు వినిపించిన న్యాయమూర్తి ఆదిత్య చౌదరి.. తన క్లయింట్‌కు ఈ హత్యతో నేరుగా సంబంధం లేదని వాదించారు. ప్రధాన నిందితుడితో కలిసి కృష్ణ కుమార్.. పాముల మంత్రగాడి వద్దకు వెళ్లి రూ.10,000 ఇచ్చి ఓ సర్పాన్ని తీసుకొచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన స్నేహితుడు పామును ఎందుకు కొనుగోలు చేశాడో తెలియదని, వైద్యం కోసం కొన్నట్టు కృష్ణ కుమార్‌కు చెప్పాడని అన్నారు. తన అక్రమ సంబంధం విషయం అత్తకు తెలిసిందని రాజస్థాన్‌కు చెందిన అల్పనా అనే మహిళ.. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి పాము కాటు వేయించి ఆమెను హత్యచేయించింది. జుంజూహు జిల్లాలోని ఓ గ్రామంలో 2019లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. హతురాలు సుబోధ్ దేవి కుమారులిద్దరూ ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు సచిన్‌కు అల్పనాతో 2018 డిసెంబరు 12 వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత సచిన్ విధులకు వెళ్లిపోగా.. సుభోదేవి భర్త రాజేశ్ కూడా ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. దీంతో అత్తాకోడళ్లు ఇద్దరే ఉండగా.. అల్పనా జైపూర్‌కు చెందిన మనీష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరుచూ అతడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా.. సుభోదేవికి అనుమానం వచ్చింది. మనీష్‌తో అక్రమ సంబంధం తెలియడంతో కోడలిని నిలదీసింది. తన ప్రేమయాణం అత్తకు తెలియడంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి అల్పనా పథకం వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా చంపాలని నిర్ణయించుకున్న ఇద్దరూ.. అందుకు తెలివిగా పామును వాడుకున్నారు. జూన్ 2, 2019లో సుభోదేవి పాము కాటుతో చనిపోగా.. నెలన్నర తర్వాత కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి, కొన్ని ఆధారాలను అందించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్పనా కాల్ డేటాను పరిశీలించిన సుబోధ్ దేవి చనిపోయిన మర్నాడు మనీశ్‌కు 124 సార్లు కాల్ చేసినట్టు, 19 సార్లు కృష్ణ కుమార్‌తో మాట్లాడినట్టు గుర్తించారు. అల్పనా, మనీష్, కృష్ణ కుమార్‌లు కలిసి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చి.. గతేడాది జనవరి 4 ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వీరు జైల్లోనే ఉన్నారు.


By October 07, 2021 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-denies-bail-to-rajasthan-snake-bite-murder-accused/articleshow/86830424.cms

No comments