Breaking News

రైతుకు సాయం చేసిన శేఖర్ కమ్ముల.. ప్రశంసిస్తున్న నెటిజన్స్.. అసలేమైంది?


సినిమాల్లో హీరోయిజాన్ని చూపించ‌డ‌మే కాదు.. నిజ జీవితంలోనూ అలా ఉండే వారిని రియ‌ల్ హీరోలంటారు. కోవిడ్ స‌మ‌యంలో మ‌న న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలబ‌డి రియ‌ల్ హీరోస్ అని నిరూపించుకున్నారు. ఈ రియ‌ల్ హీరోల కోవ‌లో శేఖ‌ర్ క‌మ్ముల కూడా ఉన్నారు. కోవిడ్ స‌మ‌యంలో ప‌లువురికి త‌న వంతు సాయాన్ని చేస్తూ వ‌చ్చిన ఈ సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌ మ‌రోసారి త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. అగ్ని ప్ర‌మాదంలో ఇల్లు కోల్పోయిన ఓ రైతుకు ఆర్థిక సాయం చేశారు. అది కూడా ఓ ఛానెల్‌లో వ‌చ్చిన క‌థ‌నంపై శేఖ‌ర్ క‌మ్ముల స్పందించి ఈ సాయం చేయ‌డం విశేషం. వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా మున‌గాల మండంలోని నేల మ‌ర్రి గ్రామానికి చెందిన రైతు ల‌క్ష్మ‌య్య వ్య‌వ‌సాయ భూమిని అమ్ముకున్నారు. అందులో ల‌క్ష్మ‌య్య వాటాగా ప‌ది ల‌క్ష‌లు వ‌చ్చాయి. ఇందులో కొంత మొత్తం ఇవ్వాల్సిన అప్పులు స‌ప్పులు ఇవ్వ‌గా ఆరు ల‌క్ష‌లు మిగిలాయి. ఆ డ‌బ్బును ఇంట్లోని బీరువాలో పెట్టాడు. మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖ‌ర్చు అవుతుంద‌నే వివ‌రాల‌ను తెలుసుకునే ప‌నిలో ఉన్నాడు. అప్పుడు అనుకోకుండా ఇంట్లోని గ్యాస్ వ‌ల్ల అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. పూరిల్లు కావంతో ఇల్లు కాలిపోయింది. ఆ మంట‌ల్లో డ‌బ్బు మొత్తం కాలిపోయింది. ల‌క్ష్మ‌య్య అనుకోకుండా జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో త‌న క‌లలు కాలిపోతుంటే నిస్స‌హాయంగా చూడ‌టం త‌ప్ప మ‌రేమీ చేయ‌లేక‌పోయాడు. ల‌క్ష్మ‌య్య ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు కానీ.. ఇల్లు క‌ట్టుకోవాల‌ని దాచుకున్న డ‌బ్బుల పోయాయి. ఈ విష‌యాన్ని ఛానెల్ ద్వారా తెలుసుకున్న శేఖ‌ర్ క‌మ్ముల స్పందించి రైతుకు ఆర్థిక సాయం చేశారు. ల‌క్ష రూపాయ‌ల మొత్తాన్ని ల‌క్ష్మ‌య్య బ్యాంకు ఖాతాకు నేరుగా ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. ఈ విష‌యం తెలిసిన నెటిజ‌న్స్ శేఖ‌ర్ క‌మ్ముల మ‌న‌సు చాలా మంచిద‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. కోవిడ్ స‌మ‌యంలో పారిశుద్ధ్య కార్మికుల‌కు ఆహారాన్ని అందించిన పెద్ద మ‌న‌సు చాటుకున్న ఈ స్టార్ డైరెక్ట‌ర్ మ‌రోసారి రైతుకు అండ‌గా నిలబ‌డ్డారు. ఇక సినిమాల విషయానికి వ‌స్తే.. రీసెంట్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా రూపొందిన ల‌వ్‌స్టోరి సినిమా విడుదై భారీ విజ‌యాన్ని సాధించింది. కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత భారీ విజ‌యాన్ని సాధించిన చిత్రంగా ఇది రికార్డ్ నిలిచింది. అయితే ఈయన తదుపరి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదొక ద్విభాషా చిత్రం. తన స్టైల్‌కు భిన్నంగా ఈాసారి థ్రిల్లర్ జోనర్ మూవీని తెరకెక్కించబోతున్నారు. వచ్చే ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.


By October 26, 2021 at 11:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-sekhar-kammula-financially-helped-a-farmer-who-lost-his-money/articleshow/87272577.cms

No comments