Breaking News

నగ్న వీడియో కాల్స్‌తో వ్యాపారం.. 300 మంది నుంచి రూ.20 కోట్లు కొట్టేసిన కిలాడీ జంట!


అభివృద్ధి చెందిన సాంకేతికతతో యావత్తు ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. ఒకప్పడు మాట్లాడటానికే పరిమితమైన మొబైల్‌ఫోన్‌లు ఇప్పుడు ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు సహకరిస్తున్నాయి. దీనిని చాలా మంది దుర్వినియోగం చేస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో నగ్నంగా వీడియో కాల్స్‌ చేసి.. బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ జంట ఏకంగా 300 మందిని మోసం చేసి, రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. ఓ చిన్న కేసులో తీగలాగితే వీరి బండారం బయటపడింది. దేశవ్యాప్తంగా ఏడాదికిపైగా సాగుతున్న దందాను పోలీసులు బయటపెట్టారు. ఈ వ్యవహారంలో భార్యాభర్తలు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఘాజియాబాద్‌కు చెందిన దంపతులు సప్నా గౌతమ్‌, యోగేశ్‌ సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ తరహా మోసాలకు పాల్పడ్డారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి సలహాతో దందాకు తెరతీశారు. బాధితులతో వీడియో కాల్స్‌ మాట్లాడడం, మరికొంత మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి వారిచేత కూడా ఇవే పనులు చేయడం సప్నా బాధ్యత. బాధితుల వివరాలు, వారి ప్రదేశం, ఫోన్‌ నంబర్‌, బ్యాంకు ఖాతాలను యోగేశ్‌ సేకరిస్తుంటాడు. తొలుత పోర్న్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని, కొత్త కొత్త ఐడీలతో నగ్నంగా వీడియోకాల్స్‌ చేస్తారు. దీనికి నిమిషానికి రూ.234 వసూలు చేస్తారు. ఇందులో సగభాగం వెబ్‌సైట్‌ నిర్వాహకులకు, మిగిలిన సగం వీరికి చేరుతుంటుంది. అయితే, ఇంతకంటే తక్కువ మొత్తానికి తాము వీడియోలో అందుబాటులో ఉంటామంటూ బాధితుల నుంచి వీరు ఫోన్‌ నెంబర్లు సేకరిస్తారు. నేరుగా వాట్సాప్‌, ఇతర మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్‌ చేసి, కవ్వించి ముగ్గులోకి దింపుతారు. అనంతరం బాధితుల వీడియోలను రికార్డు చేస్తారు. వారి ఫోన్‌ నెంబర్‌కు వీడియోలు పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తారు. తాము అడిగిన మొత్తం చెల్లించాలని.. లేదంటే వీడియోలు బయటపెడతామని బెదిరిస్తారు. ఇలా దాదాపు 300 మందిని బ్లాక్ మెయిల్ చేసి, రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ మోసాల్లో 30 మంది వరకు అమ్మాయిల పాత్ర ఉంది. నెలకు వీరికి రూ.25వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్‌ చేయించేవారు. కేవలం టెక్ట్స్‌ మాత్రమే చేసే వారికి రూ.15వేలు ఇచ్చేవారు. ఇలా వచ్చిన సొమ్ముతో వీరు జల్సాలు చేసేవారు. కొత్త కొత్త నంబర్లతో ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తుండేవారు. పరువు పోతుందని బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో దందా ఏడాదిపాటు బాగానే సాగిపోయింది. గుజరాత్‌కు చెందిన ఓ సీఏ కంపెనీ యజమాని ఫిర్యాదుతో ఈ గుట్టురట్టయ్యింది. తన సంస్థకు చెందిన ఓ ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేసినట్లు రాజ్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా ఘజియాబాద్‌ పోలీసులను సంప్రదించడంతో ఈ దందా బయటపడింది. రెండేళ్లలో మొత్తం రూ.22 కోట్లు సంపాదించినట్టు తేలింది.


By October 26, 2021 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sextortion-gang-targeted-300-in-2-years-made-rs-22-crore-in-ghaziabad-of-uttar-pradesh/articleshow/87271063.cms

No comments