అఫ్గన్‌లో తాలిబన్ల అరాచకం.. మహిళా వాలీబాల్ ప్లేయర్ తల నరికేశారు!
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల అరాచక పాలన పరంపర కొనసాగుతోంది. మహిళల విషయంలో అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తూ వారి హక్కులను హరిస్తున్నారు. తాజాగా, వాలీబాల్ క్రీడాకారిణిని అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. అఫ్గన్ మహిళల జాతీయ వాలీబాల్ జూనియర్ టీమ్ క్రీడాకారిణి మహజబీన్ హకిమిని ఈ నెల మొదట్లో నరికి చంపేసినట్టు బ్రిటిషన్ మీడియా వెల్లడించింది. ఈ విషయం బయటి ప్రపంచానికి ఇంకా తెలియదని.. బయటపెడితే చంపేస్తామని తాలిబాన్లు ఆమె కుటుంబసభ్యులను బెదిరించారని కోచ్ వెల్లడించారు. మహజబీన్‌ను నరికి చంపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోచ్ సురయా అఫ్జలి (పేరు మార్చారు) ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మొన్నటి వరకూ దేశం తరఫున ఆడి, తలెత్తుకుని తిరిగిన మహిళా అథ్లెట్లు భయంతో రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారని ఆయన తెలిపారు. తాలిబన్లు అఫ్గన్‌కు ఆక్రమించుకోడానికి ముందు మహజబీన్ కాబూల్ మున్సిపల్ వాలీబాల్ క్లబ్ తరఫున ఆడినట్టు పేర్కొన్నారు. తాలిబన్ల దేశాన్ని ఆక్రమించుకోవడంతో కేవలం ఇద్దరు మహిళా వాలీబాల్ ఆటగాళ్లు మాత్రమే దేశం నుంచి తప్పించుకున్నారని అన్నారు. మహజబిన్ హాకిమీతో సహా మిగతావాళ్లు దురదృష్టవశాత్తూ ఇక్కడే ఉండిపోయారని కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న మహిళా అథ్లెట్ల కోసం తాలిబన్లు గాలిస్తున్నారని అఫ్జలీ తెలిపారు. ముష్కరుల కంటబడకుండా ప్రస్తుతం దుర్బర జీవితం గడుపుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, గతవారం 100 మందికిపైగా మహిళల ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులను ఫిఫా విజయవంతంగా అఫ్గన్ దాటించిన విషయం తెలిసిందే. కాగా, గత ప్రభుత్వంతో యుద్ధంలో మరణించిన ఆత్మాహుతి దళాల సభ్యులను తాలిబాన్ సర్కారు ప్రశంసించింది. వారి కుటుంబాలకు 111 డాలర్ల నగదు, ఇంటి స్థలం ప్రకటించింది. మరోవైపు, అఫ్గన్ సంక్షోభంపై రష్యా బుధవారం తాలిబాన్, ఇతర వర్గాలతో చర్చలు జరిపింది. అఫ్ఘాన్ ప్రభుత్వంలో అన్ని జాతులు, రాజకీయ శక్తులకు స్థానం ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వారికి సూచించారు.
By October 21, 2021 at 08:21AM
No comments