Breaking News

వైద్యశాస్త్రంలో మరో మిరాకిల్.. విజయవంతంగా మనిషికి పంది కిడ్నీ!


వైద్యశాస్త్రంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. జంతువు అవయవాన్ని మనిషికి అమర్చి అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త చరిత్రను లిఖించారు. పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. సెప్టెంబరు 25న న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ వైద్యులు ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు. రెండు గంటలకుపైగా శ్రమించి మనిషికి అమర్చిన ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేయడం విశేషం. అవయవాల కొరతను అధిగమించడంలో ఈ పరిశోధనను కీలక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తికి తాత్కాలికంగా పంది కిడ్నీని అమర్చి, ప్రయోగం నిర్వహించారు. మూడు రోజులపాటు దాని పనితీరును పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని శస్త్రచికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ రాబర్డ్‌ మాంట్‌గోమరి తెలిపారు. వాస్తవానికి పంది కణాల్లోని గ్లూకోజ్‌ మనిషి శరీర వ్యవస్థకు సరిపోలదు. దీంతో మానవ రోగనిరోధక వ్యవస్థ ఈ అవయవాలను తిరస్కరిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్‌వైయూ శాస్త్రవేత్తలు... జన్యుపరమైన మార్పులు చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు. దాని కణాల్లో గ్లూకోస్ స్థాయిలను తగ్గించి, మనిషి రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపకుండా కొన్ని మార్పులు చేశారు. తర్వాత ఆ మూత్రపిండాన్ని మనిషికి అమర్చారు. ఈ కిడ్నీ శరీరంలోని వ్యర్ధాలు, మూత్రాన్ని బయటకు పంపిందని డాక్టర్ రాబర్ట్ మాంట్‌గోమరీ అన్నారు. రోగి ఒక కాలు పైభాగంలో ఉన్న రక్త నాళాలకు కిడ్నీని అనుసంధానం చేశారు.. తద్వారా బయాప్సీ నమూనాలను సేకరించారు. అవయవదాత అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా పంది కిడ్నీని అమర్చడానికి అతడి కుటుంబసభ్యులు అంగీకరించారు. శస్త్రచికిత్స తర్వాత ఐసీయూలో 54 గంటల పరిశీలించగా, ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని గుర్తించారు. ‘ఇప్పటి నుంచి మూడు వారాలు, మూడు నెలలు, మూడు సంవత్సరాలు ఏమి జరుగుతుందనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగా ఉంది.. మనం నిజంగా సమాధానం చెప్పగలిగే ఏకైక మార్గం మానవ క్లినికల్ ట్రయల్స్ కొనసాగించడం.. కానీ ఇది చాలా ముఖ్యమైన ఇంటర్మీడియట్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను.. ప్రారంభంలో ఈ విషయాలు జరుగుతాయని మనకు తెలియజేస్తుంది’ అని డాక్టర్ గోమరీ పేర్కొన్నారు.


By October 21, 2021 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-medical-team-succeeded-in-temporarily-attaching-a-pig-kidney-to-human-in-first-time/articleshow/87174370.cms

No comments