Breaking News

మా పిల్లలకు ఒక్క అవకాశం ఇవ్వండి.. యోగి సర్కారుకు కశ్మీరీ కుటుంబాలు అభ్యర్థన


టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలుపుతో సంబరాలు చేసుకున్నారనే ఆరోపణలపై కశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులను యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను క్షమించి విడుదల చేయాలంటూ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కశ్మీరుకు చెందిన షౌకత్ అహ్మద్ గనై, అర్షద్ యూసుఫ్, ఇనియత్ అల్తాఫ్‌లు ఆగ్రాలోని రాజా బల్వంత్ సింగ్ ఇంజినీరింగ్ కాలేజీలో పీఎం స్పెషల్ స్కాలర్ షిప్‌తో విద్యాభ్యాసం చేస్తున్నారు. మహ్మద్ షాబాన్ గనై అనే వ్యక్తి కుమారుడు షౌకత్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ‘‘భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత షౌకత్‌ను అరెస్టు చేసి ఆగ్రా సెంట్రల్ జైలులో ఉంచారు.. ఏం జరిగిందో మాకు తెలియదు. మా కుమారులు ఏదైనా తప్పు చేసి ఉంటే, వారి తరఫున మేము క్షమాపణలు చెబుతున్నాం.. వారి కెరీర్ నాశనం కాకుండా ఉండేందుకు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని అభ్యర్థించారు. షౌకత్ ను విడుదల చేయాలని అతని తల్లి హఫీజా బేగం యోగి సర్కారు ప్రాధేయపడ్డారు. తన చదువు కోసం నేను అన్నీ త్యాగం చేశానని, మాకు ఉన్న కొంచెం భూమిని కూడా అమ్ముకున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. షౌకత్, మరో ఇద్దరు విద్యార్థులను విడుదల చేయాలని జమ్మూకశ్మీరుకు చెందిన విద్యార్థుల కుటుంబసభ్యులు వేడుకున్నారు. షౌకత్‌ది బందిపొరా జిల్లా కాగా.. అర్షద్ యూసుఫ్, మొహమూద్ అల్తాఫ్‌లు బుద్గాం జిల్లాకు చెందినవారు. యూసుఫ్‌‌ తండ్రి చనిపోగా.. తల్లి ఒక్కరే ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం. ‘యూసుఫ్ మా జీవనోపాధికి చివరి ఆశ.. మేం అతని తరఫున అధికారులకు క్షమాపణలు కోరుతున్నాం.. అతన్ని విడుదల చేయమని వారిని కోరుతున్నాం’అని తల్లి పేర్కొంది. మానవతా ద్పక్పథంతో యూసుఫ్, ఇద్దరు విద్యార్థులను విడుదల చేయాలని వారి కుటుంబసభ్యులు కోరారు. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ముగ్గురు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. కాలేజీ అధికారులు ఈ విద్యార్థులకు క్లీన్ చిట్ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి నినాదాలు చేయలేదని ధ్రువీకరించారు. అటు, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకున్నారు. ఆగ్రాకు వెళ్లి మా పిల్లలను కలుసుకోవడానికి, లాయర్‌ను పెట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవని వాపోయారు. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుని విడుదల కోసం ప్రయత్నించాలని కోరారు. మానవతాదృక్పథంతో వారిని విడుదల చేసి, ఇంకో అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు.


By October 30, 2021 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/forgive-our-son-release-him-on-humanitarian-grounds-kashmiri-students-family-appeal-to-up-govt/articleshow/87389760.cms

No comments