Breaking News

జాతీయ భద్రత పేరుతో ప్రతిసారీ తప్పించుకోలేరు.. పెగాసస్‌పై కేంద్రానికి సుప్రీం షాక్!


పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంలో కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజల వ్యక్తిగత జీవితాలపై నిఘాపెట్టే సర్వసత్తాక అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టంచేసింది. పెగాసస్ స్పేవేర్‌తో నిఘా ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర విచారణకు నిపుణుల కమిటీని నియమించింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీవీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కమిటీలో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్‌తో పాటు సైబర్‌ భద్రత, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, నెట్‌వర్క్స్‌, హార్డ్‌వేర్‌ నిపుణులు నవీన్‌కుమార్‌ చౌధురి, పి ప్రబాహరన్‌, అశ్విన్‌ అనిల్‌ గుమస్తేలతో సభ్యులుగా ఉంటారు. అలాగే, మాజీ ఐపీఎస్‌ అధికారి అలోక్‌ జోషీ, డాక్టర్‌ సందీప్‌ ఒబెరాయ్‌లు ఆయనకు సహకరిస్తారు. పెగాసస్ స్పైవేర్‌ వ్యవహారంలో ఆరోపణలపై వీలైనంత త్వరగా దర్యాప్తు జరపాలని కమిటీకి నిర్దేశించింది. 8 వారాల తర్వాత జరిగే విచారణనాటికి తమకు నివేదిక అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పెగాసస్‌ గూఢచర్యం ఆరోపణలను కేంద్రం నోటిమాటగా ఖండిస్తే చాలదని.. ప్రతిసారీ జాతీయ భద్రత పేరు చెప్పి తప్పించుకోజాలదని వ్యాఖ్యానించింది. అసలు గూఢచర్యం జరిగిందా? లేదా? చెప్పాలని సమయమిచ్చినా స్పందించలేదని, దీనిపై ఖండనలోనూ స్పష్టత లేదని న్యాయస్థానం ఆక్షేపించింది. పెగాసస్ ఆరోపణలపై విచారణకు నిపుణుల కమిటీని నియమిస్తామన్న కేంద్రం అభ్యర్థనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. అది నిర్దేశిత న్యాయసూత్రాలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. నేరుగా బాధితులే కోర్టును ఆశ్రయించారని... న్యాయం చేయడమే కాదు.. చేసినట్లు కనిపించాలని ధర్మాసనం వ్యా ఖ్యానించింది. పెగాసస్‌ స్పైవేర్‌తో 300 భారతీయ ఫోన్‌ నంబర్లపై నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కన్సార్టియం కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలకు మాత్రమే విక్రయించే ఈ టెక్నాలజీతో దేశంలోని ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు తదితరులపై నిఘా ఉంచారని, ఈ అంశంపై విచారణ జరపాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ల దాఖలయ్యాయి. జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, న్యాయవాది ఎంఎల్‌ శర్మ, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా, సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిటాస్‌ తదితరులు దాఖలుచేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది. ‘దేనినైనా రహస్యంగా ఉంచదలచుకుంటే.. దానిని నీ నుంచీ దాచిపెట్టాలి’ అని ‘1984’ పుస్తక రచయిత జార్జి ఆర్వెల్‌ను ఉటంకిస్తూ.. 46 పేజీల తీర్పును చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ వెలువరించారు. ‘ప్రస్తుత ప్రపంచంలో గోప్యతను నియంత్రించడం అంటే.. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి.. కానీ ప్రతిసారీ జాతీయభద్రతపై ఆందోళన వ్యక్తంచేసి.. ప్రభుత్వం తప్పించుకోజాలదు.. జాతీయ భద్రత పేరుతో దానిని ప్రస్తావించకుండా న్యాయవ్యవస్థను భయపెట్టలేరు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోదు.. కానీ ప్రేక్షకుడిగా ఉండిపోదు.. న్యాయసమీక్ష జరపకుండా ఎలాంటి నిషేధమూ లేదు. కేంద్రం ఈ వ్యవహారంలో కోర్టును మౌనప్రేక్షకుడిలా మార్చకుండా.. తన వైఖరిని స్పష్టంచేసి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని దుర్వినియోగపరిచారని పిటిషనర్లు ఆందోళన వ్యక్తంచేశారని.. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడంలో తాము ఏనాడూ వెనుకంజ వేయబోమని న్యాయమూర్తులు తెలిపారు. గోపనీయ హక్కుపై చర్చించాల్సి ఉందన్నారు.


By October 28, 2021 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-orders-probe-into-alleged-pegasus-snooping-controversy/articleshow/87323966.cms

No comments