పాముతో కాటు వేయించి భార్య హత్య.. మిస్టరీని చేధించడంతో దోషిగా తేలిన భర్త
పాముతో కాటు వేయించి భార్యను హత్యచేసిన భర్తను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భార్యను పాముతో కరిపించి చంపిన కేరళ వ్యక్తిని కొల్లం ఆరో అదనపు సెషన్స్ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. దోషికి బుధవారం శిక్షను ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. కొల్లం జిల్లాలోని అంచల్ పట్టణానికి చెందిన ఉత్రా (25), సూరజ్ (32) భార్యాభర్తలు. వివాహమైన తర్వాత వీరి కాపురం కొద్ది రోజులు సజావుగా సాగింది. అయితే, సూరజ్ మరో అమ్మాయిని వివాహం చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా భార్యను పాముతో కాటు వేయించి చంపాలని పథకం వేశాడు. పాములు పట్టే ఓ వ్యక్తిని సంప్రదించి కొత్త డబ్బులిచ్చి నాగుపామును తీసుకున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది మే 6న ఉత్రాతో నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ తాగించిన సూరజ్.. ఆమె నిద్రపోయిన తర్వాత పామును వదిలి కరిపించాడు. పాముతో రెండుసార్లు బలవంతంగా కాటు వేయించడంతో ఆమె మృతిచెందింది. గతంలో కూడా ఉత్రా పాముకాటుకు గురికావడంతో.. కుమార్తె మృతిపై అనుమానంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం తమ కుమార్తెను గతంలో వేధించిన విషయాన్ని తెలియజేశారు. దీంతో సూరజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించి అసలు నిజాన్ని బయటపెట్టారు. ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆధారాలు లేకపోయినా శాస్త్ర, సాంకేతికత సాయంతో మర్డర్ మిస్టరీని పోలీసులు నిరూపించడం విశేషం. పదిహేడు నెలల్లోనే విచారణ పూర్తిచేసి, నిందితుడ్ని దోషిగా నిరూపించారు. ‘సాధారణంగా వేసేటప్పుడు గాయం 1.7 నుంచి 1.8 సెం.మీ. ఉంటుంది... కానీ, హతురాలు ఉత్రా శరీరంపై 2.3 నుంచి 2.8 సెం.మీ. వరకు ఉంది.. పాముతో బలవంతంగా కాటు వేయించినప్పుడే ఇలా జరుగుతుంది’అని పోలీస్ అధికారి తెలిపారు. ఆమెను కరిచిన తర్వాత పాము కూడా చనిపోయిందని, దానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా వారం రోజుల నుంచి ఎటువంటి ఆహారం లేకపోవడంతో మరింత కోపంతో కాటువేసిందని గుర్తించినట్టు వెల్లడించారు. ఉత్రా శరీరంలో నిద్రమాత్రల అవశేషాలను గుర్తించామన్నారు. ‘నిందితుడు అత్యంత పకడ్బంధీగా పథకం వేసి, అమలు చేశాడు.. కొద్ది నెలల పాటు ఇంటర్నెట్‌లో దీనిపై శోధించాడు.. స్థానికంగా పాములు పట్టే వ్యక్తి సురేశ్‌ను కలిశాడు.. పామును ఎలా హ్యాండిల్ చేయాలో అతడి వద్ద శిక్షణ తీసుకున్నాడు.. 2020 మే 6న నిద్రపోతున్న ఉత్రాపైకి పామును వదిలి రెండుసార్లు కాటువేసేలా ప్రేరేపించాడు.. పాము కాటు వేయకుండా ఉండటానికి అతను రాత్రంతా మెలకువగా ఉండి, ఉదయం ఎప్పటిలాగే బయటకు వెళ్లాడు.. తర్వాత ఉత్రాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే ఆమె చనిపోయింది’అని దర్యాప్తులో తేలింది.
By October 12, 2021 at 08:02AM
No comments