భారత్ ఎక్కువ ఊహించుకుంటోంది.. యుద్ధానికి దిగితే నష్టం తప్పదు.. చైనా సంచలన వ్యాఖ్యలు
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో నెలకున్న ఉద్రిక్తతలపై 13 వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. భారత్ చేసిన సూచనలకు చైనా అంగీకరించలేదు.. సరికదా, ఎటువంటి ప్రతిపాదన చేయలేదని భారత సైన్యం ప్రకటించింది. ఇదిలా ఉండగా, భారత్‌పై మరోసారి డ్రాగన్ తన అక్కసు వెళ్లగక్కింది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహాలను చైనా అధికారిక మీడియా తప్పుబట్టింది. ఇష్టానుసారంగా భారత్ సరిహద్దుల నిర్ణయిస్తోందంటూ గ్లోబల్ టైమ్స్ దుయ్యబట్టింది. సరిహద్దు విషయంలో భారత్‌వి అవాస్తవిక డిమాండ్లని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు చైనా తలొగ్గదని వ్యాఖ్యానించింది. అంతేకాదు, భారత్ తన శక్తికి మించి ఊహించుకుంటోందని, యుద్ధానికి దిగితే భారత్ నష్టపోవడం ఖాయం అంటూ అహంకారాన్ని ప్రదర్శించింది. భారత్ అసమంజసమైన, అవాస్తవ డిమాండ్లు చర్చలకు విఘాతం కలిగించిందని ఆరోపించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ప్రతినిధి సీనియర్ కల్నల్ లాంగ్ షావోవా మాట్లాడుతూ.. ‘పరిస్థితిని తప్పుగా అంచనా వేయడానికి బదులుగా చైనా-భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని భారతదేశం గౌరవించాలి’అని వ్యాఖ్యానించారు. బలగాల ఉపసంహరణపై భారత్, చైనా మధ్య ఆదివారం జరిగిన కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చైనా వైపు ఉన్న మోల్డో బోర్డర్ పాయింట్‌లో జరిగిన ఈ చర్చల్లో బలగాల ఉపసంహరణతో పాటు పలు అంశాలను లేవనెత్తిన భారత్.. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న చైనా ఏకపక్ష చర్యలను ప్రస్తావించినట్టు ఆర్మీ తెలిపింది. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు చైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అయితే వీటిపై చైనా నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని సైన్యం తెలిపింది. చైనా బలగాలు ఇటీవల సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. చర్చల్లో భారత బృందానికి లెహ్‌లోని 14 కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నాయకత్వం వహించారు. ఏడాదిన్నరగా వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
By October 12, 2021 at 07:14AM
No comments