మిస్ వరల్డ్ అమెరికాగా శ్రీ సైనీ.. చరిత్ర సృష్టించిన భారత సంతతి యువతి
మిస్ వరల్డ్ అమెరికా 2021 టైటిల్ విజేతగా భారత సంతతి యువతి నిలిచింది. దీంతో ఈ టైటిల్ గెలిచిన తొలి భారత సంతతి యువతిగా సైనీ చరిత్ర సృష్టించింది. ప్రపంచ స్థాయిలోనిర్వహించిన ఈ పోటీలో అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతిగా నిలవడం విశేషం. అయితే, 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో ముఖంతో సహా ఎడమవైపు భాగం అంతా కాలిపోయింది. ప్రమాదంలో గుండె కూడా దెబ్బతినడంతో పేస్‌మేకర్ (కృత్రిమ గుండె)ను అమర్చారు. అయినప్పటికీ వీటిన్నంటిని అధిగమించి మిస్ వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పంజాబ్‌లోని లుధియానాలో 1996 జనవరి 6న జన్మించిన శ్రీ సైనీ.. ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులతో అమెరికాకు వెళ్లింది. అప్పటి నుంచి వాషింగ్టన్‌లో వీరి కుటుంబం ఉంటోంది. విజేతగా నిలిచిన శ్రీ సైనీకి లాస్ ఏంజెల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో డయానా హెడెన్ కిరీటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీ సైనీ మాట్లాడుతూ ‘విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా, ఆత్రుతగా ఉంది... నాభావాలను మాటల్లో చెప్పలేను.. ఈ క్రెడిట్ అంతా మా అమ్మనాన్నలకు ముఖ్యంగా అమ్మకు దక్కుతుంది. ఎందుకంటే ఆమె మద్దతుతోనే ఈ రోజు ఇక్కడున్నాను..ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్ వరల్డ్ అమెరికాకు ధన్యావాదాలు’ అంటూ తన ఆనందాన్ని వ్యక్త చేసింది. ఫోర్డ్స్ సిటీ ఆఫ్ న్యూజెర్సీలో జరిగిన పోటీలోనూ శ్రీ సైనీ ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018’ కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. మిస్ వరల్డ్ అమెరికా శ్రీపై ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశంసలు కురిపించింది. ‘మిస్ వరల్డ్ అమెరికా వాషింగ్టన్ శ్రీ సైనీ ఎండబ్ల్యూఏ నేషనల్ బ్యూటీ అంబాసిడర్ అనే ప్రతిష్టాత్మక స్థానంలో ఉంది.. ఆమె నిరంతర సేవా కార్యక్రమాలకు ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకుంది.. అంతేకాదు వైద్యులు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆమె సేవ దృక్పథాన్ని యూనిసెఫ్, సుసాన్ జి కొమెన్ వంటి ఇతర సంస్థలు గుర్తించాయి. అందం గురించి మంచి నిర్వచనాన్ని ఇవ్వడమే కాక, మిస్ వరల్డ్ అమెరికా మిషన్ పట్ల అవగాహన కలిగిస్తుంది’ అని కొనియాడింది.
By October 05, 2021 at 09:16AM
No comments