Breaking News

మూడు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ అధికారి పరిధి పొడిగింపు.. కేంద్రం నిర్ణయంపై పంజాబ్ ఆగ్రహం


పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటున్న రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ () అధికార పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఆయా రాష్ట్రాల్లోని 50 కిలోమీటర్ల పరిధి వరకు తనిఖీలు, అనుమానితుల అరెస్ట్‌, వస్తువులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని కల్పించింది. అయితే పాక్‌, బంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగిన పంజాబ్‌, పశ్చిమ్ బెంగాల్‌, అసోంలో ఇప్పటి వరకు బీఎస్‌ఎఫ్‌కు అధికార ప్రాంత పరిధి 15 కిలోమీటర్లు మాత్రమే ఉండేంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా దీనిని 50 కిలోమీటర్లకు పొడిగించింది. ఉగ్రవాదం, సరిహద్దు నేరాలకు వ్యతిరేకంగా ‘జీరో టోలరెన్స్’ను నిర్ధారించడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో ఈ పరిధిలో తనిఖీలు, అరెస్ట్‌లు, స్వాధీనాలకు బీఎస్‌ఎఫ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు. ఈ నిర్ణయంపై పంజాబ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇండో-పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ అధికార పరిధిని పొడిగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ డిమాండ్ చేశారు. పంజాబ్, పశ్చిమ్ బెంగాల్, అసోలోని అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ అధికార పరిధిని 50 కిలోమీటర్ల బెల్ట్ వరకు పొడిగించాలన్న కేంద్రం చర్య ఫెడరలిజంపై ప్రత్యక్ష దాడి అని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం ఛన్నీ కోరారు. ‘‘అంతర్జాతీయ సరిహద్దుల వెంట 50 కిలోమీటర్ల బెల్ట్ లోపల బీఎస్ఎఫ్ బలగాలకు అదనపు అధికారాలు ఇవ్వాలనే కేంద్రప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇది సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి.. ఈ అహేతుక నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నేను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరుతున్నాను.’’ అని సీఎం చరణ్ జీత్ ట్వీట్ చేశారు. పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ సుఖ్జీందర్ సింగ్ రాంధవా కూడా కేంద్రం చర్యను విమర్శిస్తూ అమిత్ షా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఇది రాజకీయంగా చాలా సున్నితమైన చర్య. బీఎస్ఎఫ్ ప్రధాన లక్ష్యం సరిహద్దులను కాపాడటం.. చొరబాటును అరికట్టడం.. ఇటీవలి కేసులు వారికి నిర్దేశించిన అధికారాలు కాపాడలేకపోతున్నాయని వెల్లడించాయి’ అని అన్నారు. సోదాలు, నిర్బంధ తనిఖీల సమయంలో స్థానిక పోలీసులు, గ్రామస్తులతో కూడా క్రమం తప్పకుండా ఘర్షణలకు దారితీస్తుందని పేర్కొన్నారు.


By October 14, 2021 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bsf-gets-increased-powers-in-3-border-states-punjab-cm-strongly-oppose/articleshow/87012739.cms

No comments