Breaking News

మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు వెళ్లిన కేంద్ర ఆరోగ్య మంత్రి


మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌‌లో చేరారు. మన్మోహన్‌కు సోమవారం జ్వరం రావడంతో ఇంటి వద్దే చికిత్స తీసుకున్నారు. జ్వరం తగ్గినా నీరసం అలాగే కొనసాగడంతో కుటుంబసభ్యులు బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కార్డియోన్యూరో యూనిట్‌లో చికిత్స కొనసాగుతోంది. హృద్రోగ నిపుణుడు డాక్టర్ నితీశ్‌ నాయక్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం.. ఆయనకు చికిత్స అందజేస్తోంది. మరోవైపు, మాజీ ప్రధాని మన్మోహన్‌ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ‘‘మాజీ ప్రధాని ఆరోగ్యంపై నిరాధార వదంతులు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. సాధారణ చికిత్సే తీసుకుంటున్నారు.. ఆయన ఆరోగ్యం గురించి మేమే సమాచారం వెల్లడిస్తాం’’ అని ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్‌ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. 89 ఏళ్ల మన్మోహన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో కొవిడ్‌ బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అటు, మన్మోహన్ ఆరోగ్యంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆరా తీశారు. గురువారం ఉదయం ఎయిమ్స్‌కు వెళ్లిన ఆయన మన్మోహన్‌ను పరామర్శించారు. మాజీ ప్రధాని ఆరోగ్యం గురించి ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మన్మోహన్ జ్వరం రావడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


By October 14, 2021 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-health-minister-visits-aiims-to-enquire-about-health-of-former-pm-manmohan-singh/articleshow/87012238.cms

No comments