Breaking News

పాక్ ఎన్‌ఎస్ఏకు భారత్ ఆహ్వానం.. అఫ్గన్ పరిస్థితులపై వచ్చే నెల కాన్ఫరెన్స్


అఫ్గనిస్థాన్‌లో నెలకున్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు వచ్చే నెలలో భారత్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి రష్యా, పాకిస్థాన్ సహా పలు దేశాలను ఆహ్వానించారు. ఆయా దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో భారత్ సమావేశం నిర్వహించనుంది. కాగా, ఈ ప్రాంతీయ సమావేశానికి తమకూ ఆహ్వానం అందినట్టు చైనా, ఇరాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వెల్లడించాయి. జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సమావేశానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అధ్యక్షత వహించే అవకాశం ఉంది. నవంబరు రెండో వారంలో జరిగే ఈ కాన్ఫరెన్స్‌కు తాలిబన్లను ఇంత వరకూ పిలవలేదు. అయితే, ఈ నెల 20న జరగనున్న మాస్కో ఫార్మాట్‌‌కు మాత్రం వారిని రష్యా ఆహ్వానించింది. ఈ సమావేశానికి భారత్‌ కూడా హాజరుకానుంది. అఫ్గన్‌లో సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, మహిళలు, చిన్నారులు, మైనార్టీల సహా మానవ హక్కులను పరిరక్షించాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ‘తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం దురదృష్టవశాత్తు అఫ్గన్ సమాజం మొత్తాన్నీ ప్రతిబింబించదు’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ కాన్ఫరెన్స్‌లో పాకిస్థాన్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది లేదా పాక్ ఎన్ఎస్ఏ మొయిద్ యూసుఫ్ భౌతికంగా పాల్గొనాలని భావిస్తున్నారా? అనేది ఆసక్తికరంగా ఉంది. భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న లష్కరే తొయిబా, జైషే మొహమూద్ వంటి ఉగ్రవాద సంస్థలపై నియంత్రణ లేనప్పటికీ పాక్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను కేంద్రం పంపింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా ముగ్గురు సీనియర్ అధికారులను పాకిస్థాన్‌కు పంపాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం మంచి ఉదాహరణ. ఒకవేళ, యూసుఫ్ భౌతికంగా ఈ కాన్ఫరెన్స్‌కు హాజరైతే ఐదేళ్ల తర్వాత పాక్ ఉన్నతస్థాయి అధికారి భారత్‌లో పర్యటించినట్టువుతుంది. చివరిసారిగా 2016లో అమృత్‌సర్‌ హార్ట్ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్స్ కోసం అప్పటి పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ హాజరయ్యారు. ఈ ఏడాది మేలో నిర్వహించ తలపెట్టిన సదస్సుకు అఫ్గన్, పాక్ ఎన్‌ఎస్ఏలను ఆహ్వానించారు. అయితే, కరోనా రెండో దశ వ్యాప్తితో ఆ భేటీ రద్దయ్యింది.


By October 17, 2021 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-nsa-among-invitees-for-indias-own-conference-on-afghanistan-situation/articleshow/87077830.cms

No comments