Breaking News

ప్రేమించిన వ్యక్తితో భార్యకు వివాహం జరిపించిన భర్త.. ఈవీవీ సినిమా రిపీట్!


అచ్చం కన్యాదానం సినిమాను తలపించేలా.. భార్యను ప్రియుడికిచ్చి భర్త వివాహం జరిపించిన ఘటన ఇది. కట్టుకున్న భార్య తనతో సంతోషంగా ఉండటం లేదని గుర్తించిన ఓ భర్త.. ఆమె ఆనందాన్నే కోరుకున్నాడు. ఆమెకు ప్రేమించిన వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాడు. భార్య మనసులో వేరే వ్యక్తి ఉన్నాడని గ్రహించి.. పెద్ద మనసుతో ఇరు కుటుంబాలను ఒప్పించాడు. కట్టుకున్న భర్త పెద్దగా వ్యవహరించి భార్యకు పెళ్లి జరిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. కాన్పుర్కు చెందిన కోమల్, పంకజ్‌కు ఆరు నెలల కిందట వివాహం జరిగింది. అయితే పెళ్లి అయినప్పటి నుంచి భర్తతో కోమల్‌ అయిష్టంగానే ఉంటోంది. ఈ విషయాన్ని గమనించిన పంకజ్.. అసలు సమస్యేంటని భార్యను ఆరా తీశాడు. ‘మనసులో ఏముందో చెప్పాలని.. నీ సంతోషం కోసం ఏదైనా చేస్తా’నని ఆమెకు మాటిచ్చాడు. దీంతో ఆమె అసలు విషయం వెల్లడించింది. పెళ్లికి ముందు పింటు అనే వ్యక్తిని ప్రేమించినట్టు తెలిపింది. అయితే, కుటుంబసభ్యులు తనకు బలవంతంగా పెళ్లి జరిపించారని వివరించింది. తాను ప్రేమించిన పింటుతో ఉంటేనే సంతోషంగా ఉంటానని చెప్పింది. ఆమె చెప్పిందంతా సాంతం విన్న పంకజ్.. తొలుత షాక్ తిన్నాడ. కానీ, తర్వాత ప్రశాంతంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ‘నువ్వు సంతోషంగా ఉంటానంటే అదే నాకు ఆనందం’ అంటూ భార్య వివాహానికి ఏర్పాట్లు చేశాడు. ముందుగా, ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి సమస్యను వివరించాడు. వారిని నచ్చజెప్పి ఒప్పించాడు. చట్టబద్ధంగా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత పింటు, కోమల్కు వివాహం జరిపించారు. స్థానిక ప్రభుత్వ సంస్థ ఆశా జ్యోతి కేంద్రంలో కోమల్, పింటులకు పెళ్లి జరిపించిన పంకజ్.. అన్నీ తానై వ్యవహరించాడు. ఓ లాయర్‌ను తీసుకొచ్చి, అవసరమైన పత్రాలను సిద్ధం చేశాడు. భర్తే భార్యకు దగ్గురుండి పెళ్లి జరిపిస్తున్న విషయం తెలిసి అక్కడి అధికారులు విస్తుపోయారు. తర్వాత అతడి, గొప్ప మనసును అభినందించకుండు ఉండలేకపోయారు. దీంతో ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.


By October 31, 2021 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/husband-got-wife-married-to-lover-in-kanpur-of-uttar-pradesh/articleshow/87416383.cms

No comments