Breaking News

ఆకాశంలో ప్రసవించిన మహిళ.. ఆపరేషన్ థియేటర్‌గా మారిపోయిన విమానం!


లండన్ నుంచి కోచికి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు మొదలుకావడంతో కొద్దిసేపు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, అదృష్టవశాత్తూ విమాన ప్రయాణికుల్లో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉండటంతో ఆమెకు వెంటనే వైద్యం ప్రారంభించారు. విమానం గాల్లో ఉండగానే ఆమెకు పురుడుపోశారు. నెలల నిండని ఆ గర్భిణికి సుఖప్రసవం జరిగి, పండంటి పాపాయికి జన్మనివ్వడంతో విమానంలోని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఎయిరిండియా విమానంలో మంగళవారం చోటుచేసుకుంది. లండన్ నుంచి బయలుదేరిన నల్ల సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె గర్భం దాల్చి 29 వారాలే కావడం వల్ల ఆందోళన చెందారు. ప్రయాణికుల్లో ఉన్న వైద్యులు, నర్సులు వెంటనే స్పందించి వైద్యం అందించారు. నెలలు నిండకపోయినా సాధారణ ప్రసవం జరగడం విశేషం. అయితే, వైద్య పర్యవేక్షణ అవసరం కావడంతో మార్గమధ్యంలో విమానాన్ని దారిమళ్లించారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దించి, తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. మరో ప్యాసింజర్‌ను వీరికి తోడుగా ఉంచి, మిగతా ప్రయాణికులతో విమానం కోచికి బయలుదేరింది. ఆ ముగ్గురినీ ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి భారత్‌కు తీసుకువస్తామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎయిరిండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘విమానం గాల్లో ఉండగా పండంటి బాబు పుట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని ట్విట్టర్‌లో పేర్కొంది. ‘ప్రసవించిన మహిళ కుటుంబంతో అధికారులు సంప్రదించి, అవసరమైన సహకారం అందజేస్తామని భరోసా ఇచ్చారు.. త్వరలోనే వారిని స్వదేశానికి తీసుకొస్తాం.. ఆ చిన్నారికి దేవుడి ఆశీసులు లభించి ఆరోగ్యంగా ఉండాలి’ అని ట్వీట్ చేసింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 210 మందికిపైగా ఉన్నారు. విమానంలో ఉన్న తోటి ప్రయాణికుడు కూడా ఈ విషయం గురించి ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ‘గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఎంతో సహకరించారు.. క్షణాల్లోనే విమానం ఆపరేషన్ థియేటర్‌గా మారిపోయింది.. టీమ్ వర్క్‌లా చేసి తల్లీ, బిడ్డలకు ప్రాణం పోశారు’ అని షీను సురేష్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. మంగళవారం సాయంత్రం బయలుదేరిన విమానం కోచికి బుధవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు చేరుకోవాలి. అయితే, మహిళ ప్రసవవేదనతో ఆరు గంటల ఆలస్యంగా చేరింది.


By October 07, 2021 at 07:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/baby-born-mid-air-on-air-indias-london-cochin-flight-airline-tweets-pictures/articleshow/86828053.cms

No comments