ఇమ్రాన్ నీకు చేతకాదు గద్దె దిగిపో.. పాకిస్థాన్‌లో హోరెత్తుతున్న ప్రజా నిరసనలు
ఓవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే.. ఇంకోవైపు నిరుద్యోగం పెరిగిపోతుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని నడపడాన్ని పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు, ర్యాలీలు చేపడుతున్నారు. వారి ఆందోళనలతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడంటూ ఇమ్రాన్ ఖాన్ పనితీరుపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ధరలు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. వేలాది మంది కరాచీ రహదారులపైకి వచ్చి గొంతు విప్పుతున్నారు. నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్తు ధరలు భారీగా పెరిగాయని.. నిరుద్యోగం తాండవిస్తోందని.. ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. పెరిగిపోయిన ధరలతో పేదలు రోజుకు కనీసం రెండు పూటలు కూడా ఆహారం తినే పరిస్థితి లేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని పదవికి ఇమ్రాన్ అనర్హుడని జమాతే ఉలేమా-ఇ-ఇస్లాం సంస్థ నేత రషీద్ సుమ్రో వ్యాఖ్యానించారు. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌కు తెలియదని.. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లాహోర్‌లో ప్రజలు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరపగా.. ఇద్దరు మృతిచెందారు. అనేకమంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా, గతేడాది ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్ట్ చేసిన నేతను విడుదల చేయాలని కోరుతూ నిషేధిత అతివాద సంస్థ తెహ్రికీ లబ్బాయిక్ పాకిస్థాన్ (టీఎల్పీ) మద్దతుదారులు లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు లాంగ్‌మార్చ్ నిర్వహిస్తున్నారు. రాజధాని ఇస్లామాబాద్ వెళుతున్నవారిని భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ముగ్గురు పోలీసులు సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. తమ కార్యకర్తలు ఏడుగుర్ని పోలీసులు చంపేశారని టీఎల్పీ ఆరోపించింది. పోలీసులు నేరుగా కాల్పులకు తెగబడ్డారని.. ఇప్పటి వరకూ 700 మంది గాయపడ్డారని ప్రకటించింది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు దాడికి దిగారు.
By October 25, 2021 at 05:50AM
No comments