Breaking News

గాల్లో నుంచి తీసినట్టు రూ.8 లక్షల పరిమితికి ఏంటి?.. EWS కోటాపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు


ఆర్ధికంగా వెనుకబడి తరగతుల (ఈడబ్ల్యూఎస్) కోటా విషయంలో పలు సందేహాలను లేవనెత్తింది. వార్షిక ఆదాయం రూ.8 లక్షలు మించని వారిని ఈడబ్ల్యూఎస్‌గా గుర్తించాలన్న నిబంధనకు ప్రాతిపదిక ఏమిటని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ పరిమితిపై సమీక్ష చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో తాము జోక్యం చేసుకోవడం లేదని, అయితే ఈ విషయంలో రాజ్యాంగాన్ని అమలు చేశారా? లేదా? అన్నది పరిశీలించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘నీట్‌’‌లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయమై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధిస్తూ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. ఆదాయ పరిమితి ఎంత ఉండాలన్న విషయమై ఏమీ చెప్పదలచుకోలేదు.. అయితే ఏ ప్రాతిపదికన రూ.8 లక్షల పరిమితి ఉండాలని నిర్ణయించారన్న విషయాన్నే తెలుసుకోవాలనేది మా వైఖరని పేర్కొంది. ‘ఓబీసీల్లో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు ఉన్నవారిని సంపన్న శ్రేణిగా పరిగణించి వారికి రిజర్వేషన్ల సౌకర్యం కల్పించడం లేదు.. మరి ఈడబ్ల్యూఎస్‌‌ వర్గాలకు మాత్రం రూ.8 లక్షల ఆదాయం ఉన్నా అమలు చేస్తున్నారు.. ఇదెలా సమర్థనీయం? ఓబీసీలకు, ఈడబ్ల్యూఎస్‌లకు ఒకే తరహా ఆర్థిక పరిమితులను ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఏదో గాల్లో నుంచి తీసినట్టుగా రూ.8 లక్షల పరిమితిని నిర్ణయించలేరు.. ఇందుకు తగిన కసరత్తు చేశారా? అధ్యయనం జరగలేదంటే ఆ పరిమితిని కోర్టు కొట్టివేయవచ్చు కదా?.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల కొనుగోలు శక్తిని పరిగణనలోకి తీసుకున్నారా? ఆదాయం లెక్కింపులో ఇళ్ల విలువను పరిగణనలోకి తీసుకోకూడదని ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు? మెట్రోపాలిటన్‌ నగరాలు, ఇతర నగరాల్లో నివాస భవనాల ఇళ్ల విలువలో తేడాలు చూపకూడదని ఎందుకు భావిస్తున్నారు?’ అని సందేహం వ్యక్తం చేసింది.


By October 22, 2021 at 07:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-several-questioned-to-centre-for-ews-quota-income-limit/articleshow/87196599.cms

No comments